గ్యాస్ కష్టాలు.. కట్టెల పొయ్యిపై కష్టపడుతున్న ‘పిస్తా హౌస్’!

  • కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీపై కేంద్రం ఆంక్షలు
  • హోటళ్లు, రెస్టారెంట్లకు తగ్గిన గ్యాస్ సరఫరా
  • రంజాన్ నెల నేపథ్యంలో ‘భట్టీ’లపై హలీం తయారీ
నగరంలోని హోటళ్లలో ప్రస్తుతం ఎల్పీజీ కొరత ఏర్పడింది. గల్ఫ్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరా దెబ్బతినడంతో కేంద్రం కమర్షియల్ సిలిండర్ల సరఫరాపై ఆంక్షలు విధించింది. దీనివల్ల నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ దొరకక అల్లాడుతున్నాయి. రంజాన్ మాసం కావడంతో హైదరాబాద్‌కే ప్రత్యేకమైన ‘హలీం’ మెనూ నుంచి తొలగించకుండా ఉండేందుకు ప్రముఖ రెస్టారెంట్ ‘పిస్తా హౌస్’ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.

 

గ్యాస్ సిలిండర్ల కొరతను అధిగమించేందుకు పిస్తా హౌస్ యాజమాన్యం తమ వంటశాలల్లో మళ్ళీ పాత కాలపు పద్ధతిలో కట్టెల పొయ్యిలను రంగంలోకి దించింది. అత్యాధునిక గ్యాస్ స్టౌల స్థానంలో పెద్ద పెద్ద కట్టె మోపులతో ‘భట్టీ’లను ఏర్పాటు చేసి, హలీం మరియు ఇతర వంటకాలను సిద్ధం చేస్తోంది. గ్యాస్ లేదనే నెపంతో కస్టమర్లను నిరాశపరచకూడదని, సంప్రదాయ పద్ధతిలో కట్టెలపై వండటం వల్ల హలీం రుచి మరింత పెరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. హోటల్ ఆవరణలో కట్టెల పొయ్యిలపై హలీం హండీలు ఉడుకుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

గ్యాస్ కొరత ముంచుకొస్తున్నా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అయిన హలీం రుచిని నగరవాసులకు అందించాలనే పట్టుదలతో పిస్తా హౌస్ వంటి సంస్థలు ఇలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. సిలిండర్ల కొరత నేపథ్యంలో హలీం తయారీ వ్యయం పెరిగినప్పటికీ, నాణ్యతలో మాత్రం రాజీ పడబోమని యాజమాన్యం స్పష్టం చేస్తోంది. మొత్తానికి గ్యాస్ కష్టాలను అధిగమిస్తూ కట్టెల పొయ్యిల సాక్షిగా హైదరాబాద్ హలీం రుచుల పరిమళాలు కొనసాగనున్నాయి.


More Telugu News