రెండ్రోజుల పాటు బాగా తిని, హాయిగా నిద్రపోతా: సూర్యకుమార్ యాదవ్

  • భారత్‌లో వరల్డ్ కప్ గెలవడం చాలా ప్రత్యేకమన్న టీమిండియా కెప్టెన్
  • తదుపరి లక్ష్యం 2028 ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడమేనని వెల్లడి
  • నాపై రోహిత్ శర్మ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టానన్న సూర్యకుమార్
  • విజయం తర్వాత ఉదయం 8 గంటల వరకు సంబరాలు చేసుకున్నామని వెల్లడి
టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీని గెలిచిన తర్వాత మీ తదుపరి ప్రణాళిక ఏంటి? అని అడిగితే ఏ కెప్టెన్ అయినా తర్వాతి సిరీస్‌ల గురించో, భవిష్యత్ సవాళ్ల గురించో చెబుతారు. కానీ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం చాలా సరదాగా, సింపుల్‌గా సమాధానమిచ్చాడు. "ప్రస్తుతానికి నా ప్లాన్ ఒక్కటే. ఇంటికి వెళ్లి, మంచి భోజనం చేసి, రెండ్రోజులు హాయిగా నిద్రపోవాలి. ఆ తర్వాతే మిగతా విషయాల గురించి ఆలోచిస్తా" అని తన తక్షణ కర్తవ్యాన్ని వెల్లడించాడు. స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో గెలిచి, ఈ ఘనత సాధించిన తొలి ఆతిథ్య జట్టుగా చరిత్ర సృష్టించిన ఆనందంలో ఉన్న సూర్య... ముంబైలోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడాడు.

ఈ విజయం జట్టు సభ్యులదే కాదు, అభిమానులది కూడా అని అన్నాడు. "మీరంతా మాతో సమానంగా సంబరాలు చేసుకున్నారు. మీ అందరికీ అభినందనలు. భారత్‌లో ప్రపంచకప్ గెలవడం చాలా ప్రత్యేకమైన అనుభూతి. ఎంతో మంది మద్దతు, ప్రార్థనల వల్లే ఇది సాధ్యమైంది" అని తెలిపాడు. 

ఈ విజయం వెనుక మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రోత్సాహం ఎంతో ఉందని సూర్య గుర్తు చేసుకున్నాడు. "2024లో రోహిత్ కెప్టెన్సీలోనే మేం టీ20 ప్రపంచకప్ గెలిచాం. ఆ తర్వాత అతడు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు నాపై పూర్తి నమ్మకం ఉంచాడు. గత రెండేళ్లుగా ఈ జట్టును విజయవంతంగా నడిపించాను. ఇప్పుడు ప్రపంచకప్ కూడా గెలిచాం. నాపై రోహిత్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయం యావత్ భారతదేశానిది" అని సూర్య వివరించాడు. టోర్నమెంట్‌కు ముందు రోహిత్ వ్యాఖ్యలను కూడా సూర్య పంచుకున్నాడు. "మీ జట్టు చాలా బాగుంది. ధైర్యంగా ఆడండి. గెలుపు మీదే అవుతుంది" అని రోహిత్ చెప్పిన మాటలు తమలో స్ఫూర్తి నింపాయని అన్నాడు.

ప్రస్తుత విజయంతోనే ఆగిపోమని, భవిష్యత్ లక్ష్యాలపై తమకు స్పష్టమైన ప్రణాళిక ఉందని సూర్య వెల్లడించాడు. "2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్ తరఫున దేశానికి స్వర్ణ పతకం అందించడమే మా తదుపరి లక్ష్యం. అదే ఏడాది మరో టీ20 ప్రపంచకప్ కూడా ఉంది. కాబట్టి హ్యాట్రిక్ ప్రపంచకప్‌లు గెలిచేందుకు మా వంతు కృషి చేస్తాం" అని ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ గెలిచిన రాత్రి జరిగిన సంబరాల గురించి చెబుతూ... "ఆ రాత్రి మేం ఏం చేశామో చెప్పాలనుంది కానీ... ఉదయం 8 గంటల వరకు మేల్కొనే ఉన్నాం. ఒక టీమ్‌గా గెలిచినప్పుడు సంబరాలు కూడా కలిసే చేసుకోవాలి. అందుకే మేమంతా కలిసే ఆనందాన్ని పంచుకున్నాం" అని సూర్య తెలిపాడు.

వరుసగా రెండుసార్లు (2024, 2026) ఐసీసీ టోర్నీలు గెలవడంతో తమపై ఒత్తిడి ఉన్నప్పటికీ, సరైన సమయంలో రాణించామని సూర్య పేర్కొన్నాడు. ఒత్తిడి లేకపోతే ఆటలో మజా ఉండదని వ్యాఖ్యానించాడు. ముంబై చేరుకున్న తర్వాతే ప్రపంచకప్ గెలిచామనే అసలైన భావన కలుగుతోందని, ఈ ఆనందం చాలాకాలం పాటు తనతోనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. తన క్రికెట్ ప్రయాణం మొదలైన ముంబైని ఎప్పటికీ వీడనని, తాను భారతీయుడిగా గర్విస్తున్నానని సూర్య పేర్కొన్నాడు. 



More Telugu News