యుద్ధం ఎఫెక్ట్.. శ్రీలంక - ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ సిరీస్ రద్దు
- మార్చి 13 నుంచి దుబాయ్ లో జరగాల్సిన సిరీస్
- యుద్ధం కారణంగా భయానక పరిస్థితులు
- సిరీస్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన శ్రీలంక క్రికెట్ బోర్డు
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు కేవలం రాజకీయాలనే కాకుండా క్రీడారంగాన్ని కూడా తాకాయి. ఈ ఉద్రిక్తతల ప్రభావంతో శ్రీలంక - ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన వైట్ బాల్ సిరీస్ అనూహ్యంగా రద్దయింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 13 నుంచి 25 వరకు దుబాయ్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య పోరు సాగాల్సి ఉంది. అయితే ఆ ప్రాంతంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో, ఆటగాళ్ల భద్రతను దృష్ట్యా సిరీస్‌ను రద్దు చేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
షార్జా వేదికగా మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ భౌగోళిక ఉద్రిక్తతలు పెరగడంతో ఇప్పుడప్పుడే మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితి లేదని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ తర్వాత సొంత దేశాలకు వెళ్లే సమయంలోనూ పలు దేశాల జట్లు ప్రయాణాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతం కావడంతో క్రికెట్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.