‘‘ట్రంప్.. ఈ పసికళ్లలోకి చూసి జవాబు చెప్పు!’’.. అంటూ మరణించిన చిన్నారుల ఫొటోలతో టెహ్రాన్ టైమ్స్ ఫస్ట్ పేజీ కథనం

  • ఇరాన్ లోని మీనాబ్ పట్టణంలో స్కూలుపై క్షిపణి దాడి
  • 165 మంది చిన్నారుల మృతి
  • ఇరాన్ క్షిపణి పనేనంటూ ట్రంప్ నిర్లక్ష్యం.. మండిపడ్డ టైమ్స్
యుద్ధం ఎంత క్రూరంగా ఉంటుందో చెప్పడానికి దక్షిణ ఇరాన్‌లోని మీనాబ్ పట్టణంలో జరిగిన ఘోరకలియే సాక్ష్యం. ఒక ప్రాథమిక పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిలో మరణించిన వందలాది మంది చిన్నారుల ఫొటోలతో ఇరాన్ ప్రభుత్వ ఆంగ్ల పత్రిక ‘టెహ్రాన్ టైమ్స్’ ప్రచురించిన కథనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ పత్రిక తన మొదటి పేజీ నిండా బలిపశువులైన చిన్నారుల ముఖాలను ప్రచురించి, వాటి పైన "ట్రంప్.. వీరి కళ్లలోకి నేరుగా చూడు" (Trump, Look Them In The Eyes) అంటూ ఇచ్చిన హెడ్డింగ్ అంతర్జాతీయ సమాజాన్ని కుదిపేస్తోంది.

ఆ పసికళ్లలో ఏం కనిపిస్తోంది..
దాదాపు 165 మందికి పైగా చిన్నారులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. చిదిగిపోయిన వారి కలలను, ఆ పసికళ్లలో మిగిలిపోయిన భయాన్ని చూపిస్తూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న తీరుపై పత్రిక నిప్పులు చెరిగింది. ‘‘అమెరికా దౌత్య పరిష్కారాలను తిరస్కరిస్తూ, అబద్ధాలు చెప్తూ బాధ్యత నుంచి తప్పుకుంటోంది. ఈ సామూహిక హత్యాకాండకు మీరే జవాబుదారీ’’ అని ఎడిటోరియల్‌లో నిలదీసింది.

సాక్ష్యాలు ఏం చెబుతున్నాయి..
స్కూల్‌ పై దాడి జరిగింది ఇరాన్ క్షిపణుల వల్లేనని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను 'బెల్లింగ్‌క్యాట్' పరిశోధనలు పటాపంచలు చేశాయి. ఆ దాడిలో వాడింది అమెరికాకు చెందిన టోమాహాక్ క్రూయిజ్ క్షిపణి అని యుద్ధ పరిశోధకుడు ట్రెవర్ బాల్ నిర్ధారించారు. ఇరాన్ విడుదల చేసిన వీడియోలను పరిశీలిస్తే, ఆ క్షిపణి ఆకారం స్పష్టంగా టోమాహాక్ అని తెలుస్తోంది. ప్రపంచంలో ఇవి కేవలం అమెరికా దళాల వద్దే ఉన్నాయి. సమీపంలోని మిలిటరీ కేంద్రాన్ని కొట్టబోయి లక్ష్యం తప్పి పాఠశాలపై పడినట్లు ఆధారాలు చూపిస్తున్నాయి.

ట్రంప్ నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు..
వందలాది మంది పిల్లలు చనిపోతే.. ‘‘అది ఇరాన్ పనే.. వారి ఆయుధాలకు అసలు గురి లేదు’’ అని ట్రంప్ మాట్లాడటంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయిన పిల్లల లెక్కను నిర్ధారించడానికి అంతర్జాతీయ సంస్థలను కూడా మీనాబ్‌లోకి అనుమతించడం లేదని ఏఎఫ్ పి పేర్కొంది.


More Telugu News