భారత విజయ రహస్యం అదే.. టీమిండియాపై పాక్ దిగ్గజాల ప్రశంసలు

  • టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండోసారి విశ్వవిజేతగా భారత్
  • టైటిల్ గెలవడానికి భారత్ అన్ని విధాలా అర్హమైన జట్టు అన్న‌ షాహిద్ అఫ్రిది
  • భారత జట్టు స్థిరత్వమే విజయాలకు కారణమన్న రషీద్ లతీఫ్
  • సంజూ, బుమ్రా ఆటతీరును ప్రత్యేకంగా మెచ్చుకున్న పాక్ మాజీలు
టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించి భారత జట్టు వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. సంజూ శాంసన్ వరుసగా మూడో హాఫ్ సెంచరీతో చెలరేగగా, బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా (4/15) అద్భుతం చేయడంతో భారత్ చారిత్రక విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపించాడు. "ప్రపంచకప్ ముగిసింది. ఈ టైటిల్ గెలవడానికి భారత్ అన్ని విధాలా అర్హమైన జట్టు. వారి టీమ్ కాంబినేషన్ అద్భుతంగా ఉంది. బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లు కూడా తుది జట్టులో ఆడేవారితో సమానంగా ఉన్నారు. మొత్తం టోర్నమెంట్‌ను వారు ఛాంపియన్లలా ఆడారు" అని అఫ్రిది తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.

సంజూ శాంసన్, బుమ్రాలను అఫ్రిది ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. "సంజూ శాంసన్ అద్భుతంగా ఆడాడు. వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. నా దృష్టిలో అతను ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడు" అని కితాబునిచ్చాడు.

మరోవైపు భారత విజయం తనకు ఆశ్చర్యం కలిగించలేదని పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అన్నాడు. "పెద్ద టోర్నీల ఫైనల్స్‌కు తరచుగా చేరుకుంటున్నప్పుడు, ఆటగాళ్లకు గెలుపు ఒత్తిడిని తట్టుకోవడం అలవాటుగా మారుతుంది. పాకిస్థాన్‌లోలా కాకుండా భారత జట్టులో స్థిరత్వం ఉండటమే వారి విజయాలకు ముఖ్య కారణం" అని ఆయన అభిప్రాయపడ్డాడు.


More Telugu News