UPSC: సివిల్స్ 301వ ర్యాంకు వివాదానికి తెర.. అసలు విజేత ఎవరంటే?: యూపీఎస్సీ క్లారిటీ

UPSC Clarifies Akanksha Singh is the Actual Rank 301 Holder
  • సివిల్స్ 301వ ర్యాంకుపై నెలకొన్న గందరగోళం
  • అసలు విజేత ఘాజీపూర్‌కు చెందిన ఆకాంక్ష సింగ్ అని ప్రకటించిన యూపీఎస్సీ
  • బిహార్‌లోని అరాకు చెందిన మరో ఆకాంక్ష సింగ్ కూడా ర్యాంకు తనదేనని వాదన
  • తన గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన అసలు విజేత
  • రెండో అభ్యర్థి నిషేధిత రణవీర్ సేన వ్యవస్థాపకుడి కుమార్తెగా గుర్తింపు
సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026లో 301వ ర్యాంకుపై కొన్ని రోజులుగా నెలకొన్న గందరగోళానికి యూపీఎస్సీ తెరదించింది. ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు ఈ ర్యాంకు తమదేనని ప్రకటించుకోవడంతో తీవ్ర చర్చనీయాంశమైన ఈ వ్యవహారంపై యూపీఎస్సీ స్పష్టతనిచ్చింది.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ద్వారా విడుదల చేసిన ప్రకటనలో ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లా అభయ్‌పూర్ గ్రామానికి చెందిన రంజిత్ సింగ్, నీలమ్ సింగ్ దంపతుల కుమార్తె ఆకాంక్ష సింగ్ అసలైన 301వ ర్యాంకర్‌ అని యూపీఎస్సీ ధ్రువీకరించింది. దీంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడినట్లయింది.

సివిల్స్ ఫలితాలు వెలువడిన తర్వాత ఘాజీపూర్‌కు చెందిన ఆకాంక్ష సింగ్‌తో పాటు బిహార్‌లోని అరా ప్రాంతానికి చెందిన మరో ఆకాంక్ష సింగ్ కూడా 301వ ర్యాంకు సాధించినట్లు మీడియా ముందుకొచ్చారు. ఇద్దరూ తమ అడ్మిట్ కార్డులను చూపిస్తూ ర్యాంకు తమదేనని చెప్పడంతో గందరగోళం మొదలైంది.

ఈ వివాదంపై ఘాజీపూర్‌కు చెందిన అసలైన విజేత ఆకాంక్ష సింగ్ ముందే స్పందించారు. తన ర్యాంకును, గుర్తింపును ఇతరులు దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. తన వాదనకు బలం చేకూరుస్తూ అసలైన గుర్తింపు పత్రాలు, ఈ-సమన్ కాపీలను కూడా ఆమె పంచుకున్నారు.

మరోవైపు బిహార్‌లోని అరాకు చెందిన ఆకాంక్ష సింగ్.. ఇది తన రెండో ప్రయత్నమని, ఈసారి ఫలితంపై నమ్మకంతో ఉన్నానని మీడియాకు తెలిపారు. తన తాతయ్య కలను నెరవేర్చానని, రోజూ 8 నుంచి 10 గంటలు చదివానని వివరించారు. ఈమె 2012లో హత్యకు గురైన, నిషేధిత మిలిషియా సంస్థ రణవీర్ సేన వ్యవస్థాపకుడు బ్రహ్మేశ్వర్ సింగ్ కుమార్తె కావడం గమనార్హం.

ఈ నెల‌ 6న సివిల్ సర్వీసెస్ 2026 పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ పరీక్షలో మొత్తం 958 మంది అభ్యర్థులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) సహా ఇతర గ్రూప్ ఏ, గ్రూప్ బీ కేంద్ర సర్వీసులకు అర్హత సాధించారు.
UPSC
Akanksha Singh
Civil Services 2026
IAS
Rank 301 Controversy
Ghazipur
Bihar
Ranveer Sena
Brahmeshwar Singh

More Telugu News