ఏడు గంటల ప్రయాణం తర్వాత తిరిగొచ్చిన ఇండిగో విమానం

  • ఢిల్లీ నుంచి మాంచెస్టర్ వెళుతున్న ఇండిగో విమానం వెనక్కి
  • 7 గంటల ప్రయాణం తర్వాత మధ్యలోనే యూ-టర్న్
  • ఇరాన్ యుద్ధంతో గగనతలంలో ఆంక్షలే కారణమని వెల్లడి
  • ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్తున్నా తప్పని ఇబ్బందులు
  • ప్రయాణికుల భద్రతే ముఖ్యమన్న ఇండిగో యాజమాన్యం
ఢిల్లీ నుంచి మాంచెస్టర్ బయలుదేరిన ఇండిగో విమానం పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అర్ధాంతరంగా వెనక్కి తిరిగింది. సుమారు 7 గంటల పాటు ప్రయాణించిన తర్వాత, మధ్యప్రాచ్యంలో హఠాత్తుగా విధించిన గగనతల ఆంక్షలతో విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు.

వివరాల్లోకి వెళితే, సోమవారం ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండిగోకు చెందిన 6ఈ33 విమానం (నార్స్ ఎయిర్‌లైన్స్) మాంచెస్టర్‌కు బయలుదేరింది. ఫిబ్రవరి 26 తర్వాత ఈ మార్గంలో ఇదే తొలి విమాన సర్వీసు కావడం గమనార్హం. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఈ విమానం ఇప్పటికే సంఘర్షణ ప్రాంతాలను తప్పించుకుంటూ, ఎక్కువ దూరం ఉండే దక్షిణ మార్గంలో (ఆఫ్రికా మీదుగా) ప్రయాణిస్తోంది.

అయినప్పటికీ, ఇథియోపియా-ఎరిట్రియా సరిహద్దు గగనతలంలోకి ప్రవేశించాక, చివరి నిమిషంలో విధించిన ఆంక్షలతో విమానం యూ-టర్న్ తీసుకుంది. ఈ ఘటనపై ఇండిగో సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. "మధ్యప్రాచ్యంలో మారుతున్న పరిస్థితుల వల్ల మా విమానాలను సుదూర మార్గాల్లో లేదా ఇతర ప్రాంతాలకు మళ్లించాల్సి వస్తోంది. చివరి నిమిషంలో విధించిన గగనతల ఆంక్షల కారణంగానే ఢిల్లీ-మాంచెస్టర్ విమానం వెనక్కి వస్తోంది. ప్రయాణికుల భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యం" అని ఇండిగో ప్రతినిధి తెలిపారు.

ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో గగనతలంపై ఆంక్షలు కఠినతరం అయ్యాయి. దీని ప్రభావం అంతర్జాతీయ విమాన సర్వీసులపై పడుతోంది. ప్రస్తుతం బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానం తిరిగి ఢిల్లీకి చేరుకుంటోంది. ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించేందుకు అధికారులతో చర్చిస్తున్నట్లు ఇండిగో యాజమాన్యం వెల్లడించింది.


More Telugu News