ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఈడీ దర్యాప్తు ముమ్మరం
- ఈడీ విచారణకు హాజరైన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడు, చాణక్య
- రెండు గంటల విచారణ తర్వాత వెళ్లిపోయిన ధనుంజయరెడ్డి
- నగదు రూపంలో లావాదేవీలపై ఈడీ అధికారుల ప్రశ్నలు
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముమ్మరం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కె.ధనుంజయరెడ్డి , కృష్ణమోహన్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడు, చాణక్య ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. రెండు గంటల విచారణ తర్వాత కృష్ణమోహన్‌రెడ్డి వెళ్లిపోగా... ఇతర నిందితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీని ఎలా రూపొందించారు? కేవలం నగదు రూపంలోనే లావాదేవీలు ఎందుకు నిర్వహించారు? అనే అంశాలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. ముఖ్యంగా పాప్యులర్ బ్రాండ్లను కాదని, కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇవ్వడం వెనుక ఉన్న కారణాలపై సమాచారాన్ని రాబట్టేందుకు ఈడీ అధికారులు ప్రయత్నించారు.. ఈ కుంభకోణం వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 4,000 కోట్ల నష్టం వాటిల్లిందని ఈడీ ప్రాథమికంగా అంచనా వేసింది.
అక్రమ సొమ్మును షెల్ కంపెనీల ద్వారా మళ్లించి, తిరిగి నిందితుల ఖాతాల్లోకి చేరేలా ప్రణాళిక రచించినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులైన రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డి, చాణక్యలకు చెందిన రూ. 441 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.