విజయ్‌ను రష్మిక పూర్తిగా మార్చేసింది: విజయ్ దేవరకొండ మేనమామ
- గతంలో విజయ్‌కు పెళ్లి పట్ల అంతగా ఆసక్తి ఉండేది కాదన్న యష్ రంగినేని
- రష్మిక పరిచయం తర్వాత విజయ్ ఆలోచనలో మార్పులు వచ్చాయని వెల్లడి
- విజయ్‌ను రష్మిక బాధ్యతాయుతమైన వ్యక్తిగా మార్చిందన్న యష్
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ బంధంపై వస్తున్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కిన శుభ సందర్భంలో, విజయ్ దేవరకొండ మేనమామ, ప్రముఖ నిర్మాత యష్ రంగినేని ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విజయ్ వ్యక్తిత్వంలో వచ్చిన మార్పుల వెనుక రష్మిక ప్రభావం ఎంత ఉందో ఆయన వివరించారు.
ఇంటర్వ్యూలో యష్ రంగినేని మాట్లాడుతూ... గతంలో విజయ్‌కు పెళ్లి పట్ల అంతగా ఆసక్తి ఉండేది కాదని, కెరీర్‌పైనే పూర్తి దృష్టి పెట్టాలని భావించేవాడని గుర్తు చేసుకున్నారు. అయితే రష్మిక పరిచయం తర్వాత విజయ్ ఆలోచనా విధానంలో చాలా మార్పులు వచ్చాయని, ఆమె అతడిని ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా మార్చిందని ప్రశంసించారు. 'విరోష్' జంట పట్ల తమ కుటుంబమంతా ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
అయితే, సెలబ్రిటీల మధ్య తరచూ విడాకులు, విభేదాలు వస్తున్న తరుణంలో వీరిద్దరి విషయంలో కూడా మొదట్లో కుటుంబ సభ్యులు కొంత ఆందోళన చెందారని ఆయన నిజాయతీగా అంగీకరించారు. కానీ ఒకరిపై ఒకరికి ఉన్న అపారమైన గౌరవం, అవగాహన చూశాక ఆ భయాలన్నీ తొలగిపోయాయని రంగినేని వివరించారు. భవిష్యత్తు గురించి ఎవరూ కచ్చితంగా చెప్పలేమని, కానీ ఆ దేవుడి దయతో వీరిద్దరూ జీవితాంతం ఇలాగే అన్యోన్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.