కాకినాడ, పోలవరం జిల్లాల్లో పెద్దపులి కలకలం

  • ఏలేశ్వరం మండలం పరింతడక గ్రామంలో పశువులపై దాడి
  • అడ్డతీగల మండలం వీరభద్రపురం వద్ద పులి అడుగుజాడల గుర్తింపు
  • పెద్దపులిని సురక్షితంగా బంధించేందుకు అటవీ అధికారుల గాలింపు
  • రాత్రి వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
కాకినాడ, పోలవరం జిల్లాల్లో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఏలేశ్వరం, అడ్డతీగల మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాలు, గ్రామాలను ఆనుకుని పులి తిరుగుతుండటంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు.

కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మర్రివీడు పంచాయతీ పరిధిలోని పరింతడకలో ఉన్న పామాయిల్ తోటలో ఓ గేదె, దూడపై పెద్దపులి దాడి చేసింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడికి చేరుకుని పులి అడుగుజాడలను గుర్తించారు. వెంటనే మర్రివీడుతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.

మరోవైపు పోలవరం జిల్లా అడ్డతీగల మండలం వీరభద్రపురం సమీపంలోనూ పులి జాడలు కనిపించాయి. జాతీయ రహదారి పక్కనే ఉన్న గొండోలు, కొనలోవ, గవరయ్యపేట, కొట్టంపాలెం గ్రామాల పరిసరాల్లో ఇది సంచరిస్తున్నట్లు అటవీశాఖ ధృవీకరించింది. హైవే దాటి అవతలి వైపు ఉన్న రాజవొమ్మంగి అటవీ ప్రాంతంలోకి పులి వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పులి సంచరిస్తుందన్న వార్తలతో పలు గ్రామాల్లో మహిళలు, పిల్లలు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో అటవీశాఖ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రజలు రాత్రి సమయాల్లో అడవి వైపు వెళ్లొద్దని, పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పులిని సురక్షితంగా బంధించి అడవిలో విడిచిపెట్టేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.


More Telugu News