ప్రపంచ విజేత టీమిండియాకు ప్రధాని మోదీ అభినందనలు

  • టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమిండియా
  • ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం
  • అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మ్యాచ్
  • భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపించిన ప్రధాని మోదీ
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. ఇవాళ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా.. కివీస్ జట్టుపై ఏకంగా 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి కప్‌ను ముద్దాడింది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

భారత జట్టు సాధించిన ఈ అద్భుత విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. "ఛాంపియన్స్.. టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు హృదయపూర్వక అభినందనలు" అంటూ ప్రధాని ప్రశంసించారు. ఈ గెలుపు జట్టు అద్భుతమైన నైపుణ్యాలు, దృఢ సంకల్పం, టీమ్ వర్క్‌కు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

టోర్నమెంట్ ఆసాంతం భారత ఆటగాళ్లు చూపిన పోరాట పటిమ అమోఘమని మోదీ కొనియాడారు. ఈ విజయం ప్రతి భారతీయుడి గుండెను గర్వంతో, ఆనందంతో నింపిందని తెలిపారు. "వెల్ డన్ టీమ్ ఇండియా" అంటూ ప్రధాని తన సందేశంలో భారత ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. సొంతగడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీలో భారత జట్టు కప్ గెలవడం క్రీడా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది.


More Telugu News