MS Dhoni: టీ20 వరల్డ్ కప్ ఫైనల్... ధోనీ, రోహిత్ లకు విశిష్ట గౌరవం

MS Dhoni Rohit Sharma bring T20 World Cup trophy
  • వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన దిగ్గజాలు ధోని, రోహిత్
  • ఈలలు, కేకలతో దద్దరిల్లిన నరేంద్ర మోదీ స్టేడియం
  • అలరించిన రిక్కీ మార్టిన్, ఫల్గుణి పాఠక్, సుఖ్బీర్ సింగ్
  • జాతీయ గీతాన్ని ఆలపించిన కవితా కృష్ణమూర్తి
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు ముందు అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. భారత క్రికెట్ దిగ్గజాలు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ కలిసి మెరిసిపోతున్న వరల్డ్ కప్ ట్రోఫీని మైదానంలోకి తీసుకువచ్చారు. 2007లో ధోని, 2024లో రోహిత్ భారత్‌కు కప్పు అందించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ఛాంపియన్ కెప్టెన్లు కప్పుతో రాగానే స్టేడియం మొత్తం ప్రేక్షకుల కేరింతలతో దద్దరిల్లింది. ఐసీసీ ఛైర్మన్ జే షా, జియోస్టార్ వైస్ ఛైర్మన్ ఉదయ్ శంకర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. అభిషేక్, సంజూ శాంసన్ అర్ధసెంచరీలతో విరుచుకుపడగా... చివర్లో శివమ్ దూబే దూకుడు ప్రదర్శించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు జరిగిన ముగింపు వేడుకలు (క్లోజింగ్ సెర్మనీ) ఆద్యంతం అలరించాయి. గ్లోబల్ పాప్ స్టార్ రిక్కీ మార్టిన్ తన హిట్ సాంగ్స్ 'మారియా', 'లా కోపా డి లా విడా'తో స్టేడియాన్ని హోరెత్తించారు. భారతీయ కళాకారులు సుఖ్‌బీర్ సింగ్ తన పంజాబీ పాటలతో, దండియా క్వీన్ ఫల్గుణి పాఠక్ గుజరాతీ జానపద గీతాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అనంతరం ప్రముఖ గాయని కవితా కృష్ణమూర్తి జాతీయ గీతాన్ని ఆలపించారు. 
MS Dhoni
Rohit Sharma
T20 World Cup
ICC
Narendra Modi Stadium
Cricket
India
Final Match
Jay Shah
New Zealand

More Telugu News