Revanth Reddy: కొత్త హంగులతో తెలంగాణ శాసన మండలి భవనం ప్రారంభం

Revanth Reddy Inaugurates Renovated Telangana Legislative Council Building
  • తెలంగాణ శాసన మండలి నూతన భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
  • అసెంబ్లీ ప్రాంగణంలోని పాత అసెంబ్లీ బిల్డింగ్‌లో ఇకపై మండలి సమావేశాలు
  • రూ.30 కోట్లతో పాత భవనాన్ని ఆధునీకరించిన ప్రభుత్వం
  • ఈసారి బడ్జెట్ సమావేశాలు ఈ కొత్త భవనంలోనే నిర్వహణ
  • ఒకే ప్రాంగణంలో ఉభయ సభలు ఉండేలా రేవంత్ సర్కార్ నిర్ణయం
తెలంగాణ శాసనసభ ప్రాంగణంలోని చారిత్రక పాత అసెంబ్లీ భవనం ఇకపై శాసన మండలి (లెజిస్లేటివ్ కౌన్సిల్)గా సేవలు అందించనుంది. అత్యాధునిక హంగులతో ఆధునీకరించిన ఈ భవనాన్ని ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాలు ఈ కొత్త భవనంలోనే జరగనున్నాయి.

నిజాం కాలం నాటి ఇండో-సార్సెనిక్ వాస్తుశైలిలో నిర్మితమైన ఈ భవనంలో గతంలో హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ, ఆ తర్వాత ఉమ్మడి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగేవి. 2014 రాష్ట్ర విభజన తర్వాత దీనిని ఏపీ అసెంబ్లీకి కేటాయించారు. అయితే ఏపీ అసెంబ్లీ అమరావతికి తరలివెళ్లడంతో ఈ భవనం నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరింది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అసెంబ్లీ మరియు కౌన్సిల్ రెండూ ఒకే ప్రాంగణంలో ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఈ హెరిటేజ్ భవనాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు.

ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ (ఏకేటీసీ) సహకారంతో రూ.30 కోట్లతో 18 నెలల పాటు ఈ పనులు సాగాయి. ఇందులో అధునాతన డ్రైనేజీ, ఎలక్ట్రికల్ సిస్టమ్స్, ఫ్లోరింగ్ పనులు చేపట్టారు. సీఎం, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ కోసం ప్రత్యేక ఛాంబర్లు, మీడియా హాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ భవనం పార్లమెంట్ తరహాలో ఎంతో అద్భుతంగా ఉందని, సభ్యులకు అన్ని సౌకర్యాలు కల్పించామని మండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. 

2018 నుంచి ఇప్పటివరకు జూబ్లీహాల్‌లో మండలి సమావేశాలు జరుగుతుండగా, ఇకపై ఆ హాల్‌ను ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు వినియోగించనున్నారు. అలాగే ఉభయ సభల సంయుక్త సమావేశాల కోసం కొత్త సెంట్రల్ హాల్ నిర్మించే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది.
Revanth Reddy
Telangana Legislative Council
Telangana Assembly
Hyderabad Assembly
Gutta Sukhender Reddy
Old Assembly Building
Budget Session
Indo Saracenic Architecture
Aga Khan Trust for Culture
Telangana News

More Telugu News