ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరిని ఈ సంఘటన కలిచివేసింది: పీవీఎన్ మాధవ్

  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్ల బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్న మాధవ్
  • సంతాల్ కాన్ఫరెన్స్‌లో సరైన ప్రోటోకాల్ పాటించలేదని ఆవేదన
  • రాజ్యాంగ పదవిని గౌరవించలేదంటూ టీఎంసీపై మండిపాటు
  • గిరిజన బిడ్డను అవమానించడం దేశానికే అవమానమని వ్యాఖ్య
  • పశ్చిమ బెంగాల్‌లో అరాచక పాలన సాగుతోందని ఆగ్రహం
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్ల మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరమని, ఇది తీవ్ర ఆక్షేపణీయమని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరిని ఈ సంఘటన కలిచివేసిందని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఇంటర్నేషనల్ సంతాల్ కాన్ఫరెన్స్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన ఆదివారం ఒక ప్రకటనలో స్పందించారు.

సంతాల్ సమాజం గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించేందుకు నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సులో.. అదే సామాజిక వర్గానికి చెందిన రాష్ట్రపతికి సరైన ప్రాధాన్యత దక్కకపోవడం విచారకరమని మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ప్రోటోకాల్ పాటించడంలో, అధికారుల సమన్వయంలో మమతా సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అక్కడి పరిపాలనలోని అరాచక ధోరణిని బయటపెడుతోందని విమర్శించారు.

దేశ పౌరుల రాజ్యాంగ హక్కులను కాలరాయడమే కాకుండా, ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి గౌరవాన్ని కూడా కాపాడలేని స్థితిలో బెంగాల్ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. గిరిజన సోదర సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతిని అవమానించడం అంటే.. అది దేశాన్ని అవమానించడమేనని మాధవ్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను గౌరవించే ప్రతి ఒక్కరూ ఈ ఘటనను నిరసిస్తున్నారని, ఇలాంటి చర్యలే టీఎంసీ ప్రభుత్వ పతనాన్ని సూచిస్తున్నాయని పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు.


More Telugu News