Ali Larijani: ఖమేనీ మృతి మూమూలు విషయం కాదు... ట్రంప్‌ను వదిలిపెట్టేది లేదు: అలీ లారిజాని

Ali Larijani Warns Trump Over Khamenei Death
  • ఖమేనీ మృతికి ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్న లారిజాని
  • అమెరికా సైనికులను బంధించి జైళ్లలో ఉంచామన్న ఇరాన్
  • మృతుల సంఖ్యపై ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపణ
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి డాక్టర్ అలీ లారిజాని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఖమేనీపై జరిగిన దాడికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఖమేనీకి అత్యంత సన్నిహితుడైన లారిజాని.. సోషల్ మీడియా వేదికగా అమెరికా తీరుపై నిప్పులు చెరిగారు.

ఎక్స్ వేదికగా స్పందించిన లారిజాని.. ట్రంప్‌ను తాము వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దాడుల్లో తమ నాయకుడితో పాటు అనేక మంది సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారని, ఇది సాధారణ విషయం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు. 

మరోవైపు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో అనేక మంది అమెరికా సైనికులను తాము బంధించి జైళ్లలో ఉంచామని లారిజాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం ఆరుగురు సైనికులే చనిపోయారంటూ ట్రంప్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, వాస్తవానికి మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని ఆరోపించారు. భవిష్యత్తులో కల్పిత ప్రమాదాల పేరుతో ఈ మరణాలను అమెరికా బయటపెట్టే అవకాశం ఉందన్నారు.

వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను బందీగా తీసుకెళ్లినట్లే, ఇరాన్‌లో కూడా యుద్ధాన్ని త్వరగా ముగించాలని అమెరికా భావించిందని, కానీ వారి ప్లాన్ బెడిసికొట్టిందని లారిజాని స్థానిక మీడియాతో పేర్కొన్నారు. 


Ali Larijani
Iran
Donald Trump
Ayatollah Ali Khamenei
Iran supreme leader
US military
Iran US relations
national security
Venezuela
Nicolas Maduro

More Telugu News