నేడే భారత్-కివీస్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్... పిచ్, వాతావరణంపై ఓ లుక్కేద్దాం!

  • వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించాలని భారత్ పట్టుదల
  • ఈ మెగా టోర్నీ చరిత్రలో న్యూజిలాండ్‌పై గెలవని టీమిండియా
  • అహ్మదాబాద్‌లో వర్ష సూచన లేదు.. పొడి వాతావరణం, అధిక ఉష్ణోగ్రతలు నమోదు
  • పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం.. రాత్రి వేళ మంచు కురిసే అవకాశం
  • నేటి రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న మెగా ఫైనల్
క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో ఆదివారం (మార్చి 8) భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తుండగా, తమ తొలి టైటిల్ కల సాకారం చేసుకోవాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది.

రికార్డుల వేటలో టీమిండియా
ఈ ఫైనల్ మ్యాచ్ భారత్‌కు ఎంతో ప్రతిష్ఠాత్మకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డులు చేరనున్నాయి. టీ20 ప్రపంచకప్‌ను మూడుసార్లు గెలిచిన తొలి జట్టుగా, టైటిల్‌ను డిఫెండ్ చేసుకున్న (వరుసగా రెండుసార్లు గెలిచిన) మొదటి జట్టుగా, అలాగే సొంతగడ్డపై కప్పు గెలిచిన తొలి ఆతిథ్య జట్టుగా భారత్ అవతరించే అవకాశం ఉంది. అయితే, టీ20 ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్‌పై భారత్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవకపోవడం గమనార్హం. ఈసారి ఆ రికార్డును తిరగరాస్తారో లేదో చూడాలి.

వాతావరణం ఎలా ఉందంటే?
అహ్మదాబాద్‌లో ఆదివారం వాతావరణం చాలా వేడిగా, పొడిగా ఉండనుంది. అక్యూవెదర్ నివేదికల ప్రకారం, వర్షం పడే అవకాశం అస్సలు లేదు. పగటి ఉష్ణోగ్రతలు 34 నుండి 41 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది. సాయంత్రం కూడా వాతావరణం 30 డిగ్రీల వరకు ఉంటూ కాస్త ఉక్కపోతగా అనిపించవచ్చు. వర్షం ముప్పు లేనందున అభిమానులు పూర్తి మ్యాచ్‌ను ఆస్వాదించవచ్చు.

పిచ్ రిపోర్ట్ - మంచు కీలకం
నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ ఎర్ర, నల్ల మట్టి మిశ్రమంతో రూపొందించారు. ఇది బ్యాటింగ్‌కు స్వర్గధామంలా కనిపిస్తోంది, కాబట్టి పరుగుల వరద పారే అవకాశం మెండుగా ఉంది. అయితే, పిచ్ కంటే మైదానంలోని పరిస్థితులే మ్యాచ్ ఫలితాన్ని శాసించేలా ఉన్నాయి. రాత్రి వేళ మంచు (Dew) కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే చాలా మ్యాచ్‌ల ఫలితాలను మంచు ప్రభావితం చేసింది. టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోవడం దాదాపు ఖాయం. ఒక మెగా ఫైనల్ ఫలితం కేవలం టాస్‌పైనే ఆధారపడితే అది క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగించే అంశమే.

గత తొమ్మిది టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఆరుసార్లు ఛేజింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. మిగిలిన మూడు సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. అందులో రెండుసార్లు (2007, 2024) భారత్ గెలవడం విశేషం.

గత ఫైనల్స్ రికార్డులు
గత ఆరేళ్లలో భారత్, న్యూజిలాండ్ జట్లు ఐసీసీ ఫైనల్స్‌లో తలపడటం ఇది మూడోసారి. 2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో, అంతకుముందు 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ గెలిచింది. అయితే 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ కివీస్‌ను ఓడించింది. ప్రస్తుతం ఫైనల్స్ రికార్డులో న్యూజిలాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది.

మ్యాచ్ వివరాలు
తేదీ: మార్చి 8, ఆదివారం
సమయం: రాత్రి 7:00 గంటలకు 
వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్
లైవ్ టెలికాస్ట్: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్
లైవ్ స్ట్రీమింగ్: జియో హాట్‌స్టార్ యాప్


More Telugu News