ఆకాశంలో సగం కాదు... నింగీ నేలా మీరే: మహిళలకు నారా లోకేశ్ శుభాకాంక్షలు

  • మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్
  • ఎన్టీఆర్ ఆస్తిహక్కు కల్పిస్తే చంద్రబాబు పొదుపు సంఘాలు తెచ్చారని వెల్లడి
  • పిల్లల్లో నైతిక విలువలు పెంచేలా చాగంటి కోటేశ్వరరావు నియామకం
  • ఆడపిల్లలా ఏడవొద్దు.. గాజులు తొడుక్కోలేదు వంటి మాటలు మాట్లాడటం తప్పే
  • సినిమాల్లో మహిళలను కించపరిచేలా ఉంటే ఊరుకోనని హెచ్చరిక
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం సోషల్ మీడియా వేదికగా మహిళల త్యాగాలను, శక్తిని కొనిాడుతూ ఓ ఆసక్తికరమైన సందేశాన్ని విడుదల చేశారు. "అమ్మా.. నీవు ఆకాశంలో సగం కాదమ్మా.. నింగీ నేలా నీవే. ఈ సృష్టి మీది.. మా జన్మ మీది" అంటూ మహిళల ప్రాధాన్యతను లోకేశ్ గొప్పగా వర్ణించారు. అమ్మ, భార్య, సోదరి, కుమార్తె, పిన్ని, మరదలు ఇలా ప్రతి రూపంలోనూ మనల్ని కంటికి రెప్పలా కాపాడే మాతృమూర్తులందరికీ వందనాలు సమర్పించారు.

ఈ సందర్భంగా తన కుటుంబం, పార్టీ మహిళల కోసం చేసిన కృషిని లోకేశ్ గుర్తుచేశారు. మహిళలను గౌరవించాలనే నైతిక విలువలను తన తల్లి చిన్నప్పుడే నేర్పించారని, దివంగత ఎన్టీఆర్ ఆడపడుచులకు ఆస్తిహక్కు కల్పిస్తే.. తన తండ్రి చంద్రబాబు డ్వాక్రా సంఘాలతో మహిళా సాధికారతకు బాటలు వేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమి ప్రభుత్వం 'స్త్రీ శక్తి', 'తల్లికి వందనం' వంటి పథకాల ద్వారా మహిళలకు అండగా నిలుస్తోందని, ఇంటికో మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.

భావితరాల్లో మహిళల పట్ల గౌరవం పెంచేందుకు విద్యావ్యవస్థలో కీలక మార్పులు చేశామని లోకేశ్ వెల్లడించారు. నైతిక విలువల సలహాదారుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును నియమించి, వారి సూచనలతో పాఠ్యాంశాల్లో మార్పులు చేసినట్లు చెప్పారు. పాఠ్యపుస్తకాల్లో స్త్రీ, పురుషులను సమానంగా చూపే చిత్రాలనే ముద్రించామన్నారు. సమాజంలో తరచూ వినిపించే "ఆడపిల్లలా ఏడవొద్దు", "గాజులు తొడుక్కోలేదు", "చీర గాజులు పంపిస్తా" వంటి మాటలు ఎవరు మాట్లాడినా తప్పేనని ఆయన స్పష్టం చేశారు. అలాగే సినిమాలు, వెబ్ సిరీస్‌లలో మహిళలను కించపరిచే భాష, సన్నివేశాలు ఉండకూడదని తాను పోరాడుతున్నట్లు చెప్పారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళామూర్తుల సహనానికి, శక్తికి లోకేశ్ పాదాభివందనం చేశారు.


More Telugu News