రూ.50తో టిక్కెట్ కొంటే రూ.30 లక్షల లాటరీ తగిలింది.. విజేత ఎక్కడో తెలియక డప్పులతో చాటింపు

  • పంజాబ్‌లోని బర్నాలాలో ఆసక్తికర సంఘటన
  • బర్నాలా రైల్వే స్టేషన్ సమీపంలోని ఏజెంట్ వద్ద కొనుగోలు చేసిన టిక్కెట్‌కు లాటరీ
  • టిక్కెట్‌పై పేరు, ఫోన్ నెంబర్ లేకపోవడంతో తెలియని విజేత వివరాలు
  • గల్లీ గల్లీ తిరుగుతూ మైకులు, డప్పులతో చాటింపు
ఒక వ్యక్తి రూ.50 పెట్టి లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశాడు. అతనికి రూ.30 లక్షల లాటరీ తగిలింది. కానీ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసిన ఆ వ్యక్తి మాత్రం ఎవరో తెలియడం లేదు. ఈ ఆసక్తికర సంఘటన పంజాబ్ రాష్ట్రంలోని బర్నాలాలో జరిగింది. అతని ఆచూకీ కోసం నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మైకులు, డప్పులతో గల్లీలలో చాటింపు వేయిస్తుండటం గమనార్హం.

నెలవారీ లాటరీ నిర్వహించే ఒక సంస్థ ఫిబ్రవరి 26న విజేతలను ప్రకటించింది. బర్నాలా రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక ఏజెంట్ వద్ద కొనుగోలు చేసిన నెంబరుకు లాటరీ తగిలింది. కానీ ఆ టిక్కెట్‌పై కొనుగోలు చేసిన వారి పేరు, ఫోన్ నెంబర్ తదితర వివరాలు లేవు. కమీషన్ కింద ఏజెంటుకు రూ.1 లక్ష అందజేశారు. అయితే విజేతను ప్రకటించిన నెల రోజుల్లోగా ప్రైజ్ మనీ తీసుకోని పక్షంలో అది ప్రభుత్వ ఖజానాకు వెళుతుంది.

అందుకే, ఈ లాటరీ తగిలిన వ్యక్తి కోసం ఆ ఏజెంటు గల్లీ గల్లీ తిరుగుతూ మైకులు, డప్పు చప్పుల్లతో చాటింపు వేయిస్తున్నాడు. లాటరీ తగిలిన వ్యక్తి వస్తే ప్రైజ్ మనీ ఇవ్వడం కోసం ప్రాంగణాన్ని బెలూన్లతో అలంకరించారు. టిక్కెట్ కొనుగోలు చేసిన వ్యక్తి ఆచూకీ దొరకకపోవడం స్థానికంగా ఆసక్తిని రేపింది.

Punjab Lottery
Barnala Lottery
30 Lakh Lottery
Lottery Winner Punjab
Punjab Lottery Result

More Telugu News