కర్ణుడు కాదు కుంభకర్ణుడు, మహాక్రూరుడు: రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం

  • పేదల గుండెల మీద తన్నే దుర్మార్గుడని ఆగ్రహం
  • రేవంత్ రెడ్డి కర్ణుడే అయితే రైతుబంధు ఎందుకు వేయడం లేదని ప్రశ్న
  • హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చుతున్నారన్న హరీశ్ రావు
తాను కర్ణుడిలాంటి వాడినన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. చొప్పదండి నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కర్ణుడు కాదని, కుంభకర్ణుడని ఎద్దేవా చేశారు. తనను తాను కర్ణుడితో పోల్చుకుంటున్న ముఖ్యమంత్రి మహాక్రూరుడు అని మండిపడ్డారు.

కర్ణుడు మాటతప్పని వాడని, తన కవచ కుండలాలను కూడా దానం చేసిన త్యాగధనుడని అన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల గుండెల మీద తన్నే దుర్మార్గుడని అన్నారు. రేవంత్ రెడ్డి కర్ణుడిలాంటి వాడే అయితే రైతు బంధు ఏది, ఇళ్లు కూలగొట్టి విధ్వంసం సృష్టించడం ఎందుకని నిలదీశారు. కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మారిస్తే రేవంత్ రెడ్డి రైతుబంధు ఎగ్గొట్టారని మండిపడ్డారు. 24 గంటల విద్యుత్, ఆరు గ్యారెంటీ హామీల అమలు ఎక్కడ అని ప్రశ్నించారు.

కేసీఆర్ అభివృద్ధికి కేరాఫ్ అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసానికి కేరాఫ్ అని విమర్శించారు. రేవంత్ రెడ్డికి విమర్శలు చేయడంపై ఉన్న దృష్టి రైతుల కష్టాల మీద లేదని అన్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో అభివృద్ధి అంటే ఏమిటో చూపించామని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేదని విమర్శించారు. హైడ్రా పేరుతో, మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పేదల ఇళ్లను కూల్చుతున్నారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డిని కుంభకర్ణుడితో పోల్చవచ్చని హరీశ్ రావు అన్నారు. ఎందుకంటే ఎన్నికలు రాగానే ఆయన నిద్రలేస్తారని, ఎన్నికలయ్యాక కేసీఆర్, బీఆర్ఎస్ మీద నిందలు వేయడమే రేవంత్ రెడ్డికి తెలుసని అన్నారు. కరోనా సమయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు వేసిందని గుర్తు చేశారు.

Revanth Reddy
Harish Rao
BRS
Telangana
Rythu Bandhu
KCR
Congress
Kumarnakarna

More Telugu News