పశ్చిమాసియా సంక్షోభం... భారత్ లో చిక్కుకుపోయిన విదేశీ క్రికెట్ జట్ల కోసం ప్రత్యేక విమానాలు

  • మిడిల్ ఈస్ట్ గగనతల ఆంక్షలతో విమాన సర్వీసులకు అంతరాయం
  • ఐసీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక చార్టర్డ్ విమానాల్లో జట్ల పయనం
  • నేడు ముంబై నుంచి లండన్‌కు బయలుదేరనున్న ఇంగ్లండ్ టీమ్
  • రేపు కోల్‌కతా నుంచి వెళ్లనున్న వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు
  • ఆరు రోజులుగా కోల్‌కతాలోనే చిక్కుకుపోయామన్న విండీస్ కోచ్
టీ20 ప్రపంచకప్ 2026లో తమ పోరాటం ముగిసినప్పటికీ, స్వదేశానికి వెళ్లలేక భారత్‌లోనే చిక్కుకుపోయిన విదేశీ జట్ల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం, గగనతల ఆంక్షల కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వెస్టిండీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల కోసం ఐసీసీ ప్రత్యేక చార్టర్డ్ విమానాలను ఏర్పాటు చేసింది. ఈ వారాంతంలో ఈ మూడు జట్లు భారత్ నుంచి బయలుదేరనున్నాయి.

శనివారం సాయంత్రం ఇంగ్లండ్ జట్టు ముంబై నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా లండన్‌కు బయలుదేరనుంది. ఇక మార్చి 1న భారత్ చేతిలో ఓడి సూపర్-8 దశలోనే నిష్క్రమించిన వెస్టిండీస్ జట్టు, సెమీస్‌లో కివీస్ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా జట్లు కోల్‌కతాలోనే ఉండిపోయాయి. ఈ రెండు జట్లు ఆదివారం ఒకే చార్టర్డ్ విమానంలో కోల్‌కతా నుంచి జోహన్నెస్‌బర్గ్‌కు వెళ్లనున్నాయి. అక్కడి నుంచి ఆ విమానం విండీస్ ఆటగాళ్లతో ఆంటిగ్వాకు వెళ్లనున్నట్లు సమాచారం. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడులు జరపడంతో మిడిల్ ఈస్ట్ మీదుగా వెళ్లే విమానాలకు ఆటంకం ఏర్పడటమే ఈ జాప్యానికి ప్రధాన కారణం.

కాగా, వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ శనివారం 'డే 6' అంటూ తాము కోల్‌కతాలో చిక్కుకుపోయి ఆరు రోజులయిందని ట్వీట్ చేశారు. మరోవైపు విండీస్ స్పిన్నర్ అకీల్ హొసేన్.. "క్రిస్టియానో రొనాల్డో తన జెట్ పంపి నన్ను రక్షించడం బెటర్" అంటూ సోషల్ మీడియాలో సరదాగా పోస్ట్ చేశారు. అంతకుముందు జింబాబ్వే జట్టు కూడా ఢిల్లీలో ఇలాగే ఇబ్బంది పడగా, ఐసీసీ గురువారం అడిస్ అబాబా మీదుగా వారిని హరారేకు పంపించింది.




More Telugu News