ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు.. యుద్ధం దెబ్బకు రైతులు విలవిల

  • 100 గుడ్ల హోల్‌సేల్ ధర రూ.420కి పతనం
  • స్థానిక వినియోగం తగ్గడంతో పాటు గల్ఫ్‌కు ఎగుమతులు నిలిచిపోవడమే కారణం
  • పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో చెన్నై పోర్ట్ నుంచి ఆగిన ఎగుమతులు
  • ఉత్పత్తికి తగ్గ ధర లేక పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళన
ఏపీలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఇప్పుడు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 100 కోడిగుడ్ల హోల్‌సేల్ ధరను రూ.420గా నిర్ణయించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా వినియోగం తగ్గడం, అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపడమే ఈ పతనానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ ఫారాలలో రోజుకు సుమారు 5 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. అయితే, ఇందులో కేవలం సగం మాత్రమే రాష్ట్రంలో వినియోగిస్తున్నారు. మిగిలిన 2.5 కోట్ల గుడ్లను ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే, ఇటీవల స్థానిక వినియోగం తగ్గడంతో పాటు ఎగుమతులు మందగించాయి. దీనికి తోడు, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ‘గోరుచుట్టుపై రోకలి పోటు’లా మారింది. చెన్నై పోర్టు నుంచి గల్ఫ్ దేశాలకు జరిగే కోడిగుడ్ల ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ అంతర్జాతీయ పరిణామం నేరుగా ఏపీలోని పౌల్ట్రీ మార్కెట్‌ను దెబ్బతీసింది.

ప్రస్తుతం నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (ఎన్ఈసీసీ) ఒక్కో గుడ్డు ధరను రూ.4.20గా నిర్ణయించింది. అయితే, హోల్‌సేల్ ధర ఇంత తక్కువగా ఉన్నప్పటికీ, రిటైల్ మార్కెట్‌లో మాత్రం వినియోగదారులకు ఆ ప్రయోజనం పూర్తిస్థాయిలో అందడం లేదు. చికెన్ షాపుల్లో గుడ్డును రూ.5 నుంచి రూ.5.50కి, కిరాణా దుకాణాల్లో రూ.6 వరకు అమ్ముతున్నారు. వాస్తవానికి గతేడాది డిసెంబర్‌లో 100 గుడ్ల ధర రికార్డు స్థాయిలో రూ.678 పలికింది. అప్పట్లో రిటైల్‌గా ఒక్కో గుడ్డును రూ.8కి విక్రయించారు. ఆ రికార్డు స్థాయి నుంచి ధరలు ఇంతలా పడిపోవడం పౌల్ట్రీ రంగంలో కలకలం రేపుతోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గుడ్డు ధర రూ.3.30కి పడిపోయిందనే ప్రచారం కూడా జరుగుతోంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పోర్టులు, విమానాశ్రయాలు మూతపడటంతో కేవలం గుడ్ల ఎగుమతులే కాకుండా అనేక ఇతర రంగాలపైనా ప్రభావం పడుతోంది. ఉత్పత్తికి తగిన ధర రాకపోవడంతో పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.


More Telugu News