Syed Hamid: భారత ఫుట్‌బాల్ దిగ్గజం సయ్యద్ హమీద్ కన్నుమూత

Syed Hamid Indian Football Legend Passes Away
  • 1960 రోమ్ ఒలింపిక్స్‌లో ఆడిన అత్యంత పిన్నవయస్కుడు
  • పీకే బెనర్జీ, చునీ గోస్వామి వంటి దిగ్గజాలతో కలిసి ఆడిన చరిత్ర
  • హైదరాబాద్ ఫుట్‌బాల్ పతనంపై చివరి రోజుల్లో తీవ్ర ఆవేదన
  • క్రీడాలోకం దిగ్భ్రాంతి.. పలువురి సంతాపం
భారత ఫుట్‌బాల్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. దేశం గర్వించదగ్గ క్రీడాకారుడు, మాజీ ఒలింపియన్ సయ్యద్ హబీబుల్ హసన్ హమీద్ (85) శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణవార్తతో క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. నగరంలోని విజయనగర్ కాలనీలో నిన్న సాయంత్రం ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.

1960 రోమ్ ఒలింపిక్స్‌లో పాల్గొనడం హమీద్ క్రీడా జీవితంలో ఒక మైలురాయి. కేవలం 19 ఏళ్ల వయసులోనే భారత జట్టుకు ఎంపికై, ఆ ఒలింపిక్స్‌లో ఆడిన అత్యంత పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా ఆయన రికార్డు సృష్టించారు. అంతేకాకుండా, 1960 ఆసియా కప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులోనూ ఆయన కీలక సభ్యుడిగా ఉన్నారు. దేశానికి ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించిన 14 మంది 'హైదరాబాదీ గ్రేట్స్'లో ఒకరిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరిలో 1941లో జన్మించిన హమీద్, హైదరాబాద్‌లోనే ఫుట్‌బాల్‌లో రాటుదేలారు. ఫార్వర్డ్ ఆటగాడిగా మైదానంలో మెరుపు వేగంతో కదిలేవారు. పీకే బెనర్జీ, చునీ గోస్వామి, లతీఫ్ వంటి దిగ్గజాలతో కలిసి ఆడారు. ఆయన ఎదుగుదలలో కోచ్ ఎస్.ఏ. రహీం ప్రోత్సాహం మరువలేనిది. హైదరాబాద్ స్పోర్టింగ్, హైదరాబాద్ పోలీస్, కోల్‌కతాకు చెందిన ప్రఖ్యాత మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించారు.

ఒకప్పుడు దేశానికే ఫుట్‌బాల్ నర్సరీగా పేరుగాంచిన హైదరాబాద్ కీర్తి మసకబారడం పట్ల హమీద్ తన చివరి రోజుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసేవారని సన్నిహితులు తెలిపారు. ఆయన మృతి పట్ల భారత మాజీ కెప్టెన్ విక్టర్ అమల్రాజ్, తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం కార్యదర్శి పాల్గుణ తీవ్ర సంతాపం ప్రకటించారు. హమీద్‌కు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆయన భార్య గతంలోనే మరణించారు.
Syed Hamid
Indian Football
Olympian
Hyderabad Football
1960 Rome Olympics
PK Banerjee
Chuni Goswami
Indian Football Legend
Telangana Football

More Telugu News