'భారత అతిథి నౌక'పై అమెరికా దాడి చేసిందన్న ఇరాన్ మంత్రి... స్పందించిన భారత్

  • ఫిబ్రవరి 16 నుండి 25 వరకు విశాఖ తీరంలో విన్యాసాల్లో పాల్గొన్న ఐరిస్ దేనా
  • భారత అతిథిపై దాడి జరిగిందన్న ఇరాన్ విదేశాంగ మంత్రి
  • ఫిబ్రవరి 25 తర్వాత ఆ యుద్ధ నౌక భారత అతిథి కాదన్న అధికార వర్గాలు
భారత్ తూర్పు తీరంలో జరిగిన నౌక విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళుతున్న ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా ముంచివేసిన విషయం తెలిసిందే. విశాఖలో జరిగిన విన్యాసాల్లో పాల్గొన్న ఈ నౌక శ్రీలంక సమీపానికి చేరుకుంది. అప్పటికే అమెరికా, ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో... ఐరిస్ దేనా అనే ఈ యుద్ధ నౌకపై అమెరికా దాడి చేసింది.

ఈ దాడిని భారత అతిథిపై జరిగిన దాడిగా ఇరాన్ మంత్రి అభివర్ణించగా, భారత ప్రభుత్వ వర్గాలు దీనిని కొట్టిపారేశాయి. ఐరిస్ దేనా మీద దాడిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పందిస్తూ, ఇరాన్ తీరానికి సుమారు రెండు వేల కిలోమీటర్ల దూరంలో సముద్రంలో అమెరికా దారుణానికి పాల్పడిందని అన్నారు. తమ దేశానికి చెందిన ఈ నౌకను అన్యాయంగా పేల్చివేశారని మండిపడ్డారు. 130 మంది సిబ్బందితో ఉన్న భారతీయ నౌకాదళ అతిథిని అంతర్జాతీయ జలాల్లో ఎలాంటి హెచ్చరికలు లేకుండా పేల్చివేశారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.

ఇరాన్‍కు చెందిన ఈ నౌకను 'భారత నావికాదళ అతిథి' అని ఇరాన్ మంత్రి పేర్కొనడం పట్ల భారత అధికార వర్గాలు స్పందించినట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇది దురదృష్టకర సంఘటన అయితే ఈ యుద్ధ నౌక ఆపద సమయంలో తమ సహాయం కోరలేదని వెల్లడించాయి.

ఫిబ్రవరి 16 నుంచి 25 వరకు విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో ఇరాన్‌కు చెందిన ఐరిస్ దేనా పాల్గొన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఆ నౌక ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లిందని, ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిందని గుర్తు చేశాయి.

ఫిబ్రవరి 25న ఈ ఓడ తిరిగి బయలుదేరి భారత సముద్ర జలాలను దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించిందని అధికారిక వర్గాలు వెల్లడించినట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఫిబ్రవరి 16 నుండి 25 వరకు మాత్రమే ఆ నౌక భారత అతిథి అని, అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించిందని ఆ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో ప్రమాద సమయంలో ఆ నౌక ఎలాంటి సహాయాన్ని కోరలేదని వెల్లడించాయి.


More Telugu News