Godavari Pushkaralu: గోదావరి పుష్కరాల కోసం తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ

Godavari Pushkaralu 2027 Telangana Cabinet Sub Committee Formed
  • గోదావరి పుష్కరాల నిర్వహణపై 9 మందితో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
  • కమిటీ చైర్మన్‌గా మంత్రి శ్రీధర్ బాబు.. కన్వీనర్‌గా దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి
  • 2027 జూలై 23 నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలు
  • ప్రధాన ఆలయాలు, ఘాట్ల వద్ద శాశ్వత ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ ఆదేశం
  • కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు, ప్యాకేజీ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న గోదావరి పుష్కరాలకు (2027) ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించింది. 'దక్షిణ కుంభమేళా'గా పిలిచే ఈ మహా క్రతువు నిర్వహణ, ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

కమిటీ సభ్యులుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పి.సుదర్శన్ రెడ్డిలను నియమించారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అవసరాన్ని బట్టి గోదావరి తీర ప్రాంతాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రత్యేక ఆహ్వానితులుగా సమావేశాలకు పిలవనున్నారు. త్వరలోనే కమిటీ సమావేశమై సిఫార్సులను అందజేయనుంది.

2027 జూలై 23న గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈసారి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సుమారు 560 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవహిస్తుండటంతో దాదాపు 74 ఘాట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. ముఖ్యంగా బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం ఆలయాల వద్ద రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో అక్కడ ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు.

పుష్కరాల ఏర్పాట్లు తాత్కాలికంగా కాకుండా, శాశ్వత ప్రాతిపదికన ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఆలయాల అభివృద్ధి, పర్మనెంట్ పుష్కర ఘాట్లు, రోడ్లు, వసతి సముదాయాలు నిర్మించాలని ఆదేశించారు. రోజుకు రెండు లక్షల మంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్, పార్కింగ్, మంచినీటి సౌకర్యాలు కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Godavari Pushkaralu
Telangana
Revanth Reddy
Godavari River
Pushkar Ghats
Duddilla Sridhar Babu
Komatireddy Venkat Reddy
Bathukamma festival
Hindu festival

More Telugu News