ట్రంప్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. టారిఫ్ లపై మన్ హట్టన్ కోర్టు సంచలన తీర్పు
- వసూలు చేసిన సొమ్ము వడ్డీతో కలిపి రిఫండ్ చేయాలన్న కోర్టు
- రూ.12 లక్షల కోట్లు తిరిగి చెల్లించాలని ఆదేశించిన న్యాయమూర్తి
- రిఫండ్ లు మీకు కొత్తేమీ కాదంటూ కస్టమ్స్ శాఖకు చురకలు
ట్రంప్ రెండవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2025 ఏప్రిల్ లో ‘ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్’ (ఐఈఈపీఏ) కింద ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల వస్తువులపై 10% నుంచి 18% వరకు పన్నులు విధించారు. అయితే, 2026 ఫిబ్రవరి 20న సుప్రీంకోర్టు ఈ పన్నులను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. పన్నులు విధించే అధికారం కాంగ్రెస్ (పార్లమెంట్) కే ఉంటుందని, అధ్యక్షుడికి లేదని స్పష్టం చేసింది.
రిఫండ్ లు మీకు కొత్తేమీ కాదుగా..
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే, ఇప్పటివరకు వసూలు చేసిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని జడ్జి ఈటన్ ఆదేశించారు. అసలుతో పాటు పన్ను వసూలు చేసిన రోజు నుండి లెక్కగట్టి వడ్డీని కూడా ప్రభుత్వం దిగుమతిదారులకు చెల్లించాల్సి ఉంటుంది. ‘‘రిఫండ్‌లు చేయడం మీ సిస్టమ్‌కు కొత్తేమీ కాదు. వెంటనే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసి వ్యాపారస్తుల డబ్బును వాపస్ చేయండి’’ అని జడ్జి ఆదేశించారు.
ప్రభుత్వ పరిస్థితి..
ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం ఈ తీర్పును సవాలు చేసే అవకాశం ఉంది. అయితే, అప్పటివరకు ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి 24 నుంచి ‘సెక్షన్ 122’ కింద తాత్కాలికంగా 10% పన్నులను ప్రభుత్వం తిరిగి అమలు చేస్తోంది. ఈ తీర్పుతో దాదాపు 3 లక్షల మంది దిగుమతిదారులకు ఊరట లభించనుంది.