Sharad Pawar: రాజ్యసభ బరిలో శరద్ పవార్ .. విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ

Sharad Pawar to Contest Rajya Sabha Elections as Opposition Candidate
  • మహా వికాస్ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక
  • పవార్ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్, శివసేన (యూబీటీ) మద్దతు
  • అన్న కొడుకు అజిత్ మరణంతో నిర్ణయం మార్చుకున్నట్టు ప్రచారం
  • విపక్ష కూటమికి ఒకే ఒక్క సీటు దక్కే అవకాశం
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ మరోసారి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలవనున్నారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష మహా వికాస్ కూటమి (ఎంవీఏ) ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పోటీ చేయనున్నట్టు కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే ప్రకటించారు. ఈ మేరకు కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిపారు. 

ఈ విషయంపై తాను, జయంత్ పాటిల్ కలిసి శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరేను కలిశామని సుప్రియా సూలే వెల్లడించారు. శరద్ పవార్‌కు మద్దతు ప్రకటించినందుకు కాంగ్రెస్, శివసేన (యూబీటీ) పార్టీలకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు. పవార్ అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించిందని, ఈ విషయాన్ని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో చర్చించామని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ తెలిపారు.

నిజానికి, తాను మరోసారి రాజ్యసభకు పోటీ చేయబోనని కొద్దికాలం క్రితం శరద్ పవార్ ప్రకటించారు. అయితే, ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ప్రతిపక్ష కూటమిలోని శివసేన (యూబీటీ)కి 20, కాంగ్రెస్‌కు 16, ఎన్‌సీపీ (శరద్ పవార్) వర్గానికి 10 సీట్లు ఉన్నాయి. ఈ మూడు పార్టీలు కలిస్తే ఒకే ఒక్క రాజ్యసభ స్థానాన్ని సులభంగా గెలుచుకోగలవు. ఈ నేపథ్యంలోనే అనుభవజ్ఞుడైన శరద్ పవార్‌ను ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక చేశారు.
 
Sharad Pawar
Rajya Sabha Elections
Maharashtra
Maha Vikas Aghadi
Supriya Sule
Uddhav Thackeray
Congress
NCP
Political Alliance
Indian Politics

More Telugu News