టీ20 ప్రపంచకప్ సెమీస్: తడబడ్డా నిలబడ్డ సఫారీలు.. 169/8

  • టీ20 ప్రపంచకప్ తొలి సెమీస్‌లో కివీస్‌కు 170 పరుగుల లక్ష్యం
  • విజృంభించి ఆడి హాఫ్ సెంచరీతో అదరగొట్టిన మార్కో యాన్సెన్
  • తొలుత తడబడ్డా.. చివర్లో పుంజుకున్న దక్షిణాఫ్రికా
  • న్యూజిలాండ్ బౌలర్లలో రచిన్, హెన్రీ, మెక్‌క్రాంచీలకు రెండేసి వికెట్లు
టీ20 ప్రపంచకప్ 2026 మొదటి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌కు దక్షిణాఫ్రికా 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో, ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ (55*) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో సఫారీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. కేవలం 12 పరుగులకే ఓపెనర్లు క్వింటన్ డికాక్ (10), ర్యాన్ రికెల్టన్ (0) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. కాసేపటికే కెప్టెన్ మార్‌క్రమ్ (18), డేవిడ్ మిల్లర్ (6) కూడా వెనుదిరగడంతో 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

ఈ క్లిష్ట దశలో డివాల్డ్ బ్రెవిస్ (34), ట్రిస్టన్ స్టబ్స్ (29) కాసేపు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అనంతరం స్టబ్స్‌తో జతకట్టిన మార్కో యాన్సెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 30 బంతుల్లో 2 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్టబ్స్‌తో కలిసి ఆరో వికెట్‌కు 73 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.

న్యూజిలాండ్ బౌలర్లలో కోల్ మెక్‌క్రాంచీ, రచిన్ రవీంద్ర, మాట్ హెన్రీ తలో రెండు వికెట్లు పడగొట్టగా, లాకీ ఫెర్గూసన్‌కు ఒక వికెట్ దక్కింది. ఫైనల్‌లో అడుగుపెట్టాలంటే న్యూజిలాండ్ 120 బంతుల్లో 170 పరుగులు చేయాల్సి ఉంది.


More Telugu News