దేశంలో ఇప్పుడు ఎంతమంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారో తెలుసా..?

  • డిసెంబర్ త్రైమాసికంలో 102 కోట్లు దాటిన ఇంటర్నెట్ వినియోగదారులు
  • 130 కోట్లకు చేరిన మొత్తం టెలిఫోన్ సబ్‌స్క్రైబర్లు
  • ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం రూ 194కు పెరుగుదల
భారత టెలికాం రంగం వృద్ధి పథంలో దూసుకెళుతోంది. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 102 కోట్ల (1.02 బిలియన్) మార్కును దాటింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మంగళవారం విడుదల చేసిన 'ఇండియన్ టెలికాం సర్వీసెస్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్' నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 2025 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన గణాంకాలను ట్రాయ్ ప్రకటించింది.

నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 2025 నాటికి 101.78 కోట్లుగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారులు.. డిసెంబర్ నాటికి 102.86 కోట్లకు చేరారు. ఇది 1.06 శాతం వృద్ధిని సూచిస్తోంది. వీరిలో 98 కోట్లకు పైగా వైర్‌లెస్ వినియోగదారులే ఉండటం గమనార్హం. ముఖ్యంగా బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 100 కోట్లు (1 బిలియన్) దాటడం దేశంలో హై-స్పీడ్ డేటా సేవలకు ఉన్న డిమాండ్‌ను తెలియజేస్తోంది.

మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్యలోనూ భారీ వృద్ధి నమోదైంది. సెప్టెంబర్‌లో 122.89 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య.. డిసెంబర్ నాటికి ఏకంగా 130.61 కోట్లకు పెరిగింది. త్రైమాసిక పరంగా చూస్తే ఇది 6.28 శాతం వృద్ధి. 

టెలికాం కంపెనీల ఆదాయాల్లోనూ సానుకూల ఫలితాలు కనిపించాయి. డిసెంబర్ త్రైమాసికంలో టెలికాం రంగం స్థూల ఆదాయం రూ.1,02,475 కోట్లుగా నమోదైంది. కంపెనీలకు ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం రూ.190.99 నుంచి రూ.194.57కు పెరిగింది. ఇక బ్రాడ్‌కాస్టింగ్ రంగానికి సంబంధించి, దేశంలో ప్రస్తుతం 920 ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానెళ్లు ఉన్నాయని, అందులో 335 పే ఛానెళ్లు అని ట్రాయ్ తన నివేదికలో పేర్కొంది.


More Telugu News