RCB: ఆర్సీబీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త

RCB Fans Get Good News About Bangalore Matches
  • చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి
  • బెంగళూరులో 5 మ్యాచ్‌లు.. రాయ్‌పూర్‌లో మరో 2 మ్యాచ్‌లు ఆడనున్న ఆర్సీబీ
  • గత ఏడాది తొక్కిసలాట ఘటన తర్వాత స్టేడియంపై కొనసాగిన నిషేధం
  • ప్రభుత్వానికి, పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఆర్సీబీ సీఈవో
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు శుభవార్త. ఎన్నో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లకు వేదికైన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ తిరిగి అడుగుపెట్టనుంది. రాబోయే ఐపీఎల్ సీజన్‌లో మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో ఆర్సీబీ తన ఐదు హోమ్ మ్యాచ్‌లను సొంతగడ్డపైనే ఆడనుంది.

గత ఏడాది ఆర్సీబీ తన తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన సందర్భంగా జరిగిన సంబరాల్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు గాయపడ్డారు. నిర్వహణ లోపం వల్ల జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విచారణ చేపట్టిన అధికారులు స్టేడియంలో కార్యకలాపాలను సస్పెండ్ చేశారు. దీంతో ఆర్సీబీ మరో వేదికను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ప్రస్తుతం భద్రతా చర్యలు మెరుగుపరచడం, ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి లభించింది. అయితే, ఆర్సీబీ ఆడాల్సిన మిగిలిన రెండు హోమ్ మ్యాచ్‌లు మాత్రం ముందస్తు ఒప్పందం ప్రకారం రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతాయి.

ఈ విషయమై ఆర్సీబీ సీఈవో రాజేష్ మీనన్ మాట్లాడుతూ.. కర్ణాటక ప్రభుత్వం, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. "చిన్నస్వామి స్టేడియం కేవలం మా హోమ్ గ్రౌండ్ మాత్రమే కాదు, మా జట్టు అస్తిత్వం. ఇక్కడి అభిమానుల కేరింతలు ఆటగాళ్లకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. మా అభిమానులు సొంతగడ్డపై మ్యాచ్‌లు చూసేందుకు అర్హులు" అని ఆయన పేర్కొన్నారు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
RCB
Royal Challengers Bangalore
IPL 2026
M Chinnaswamy Stadium
Bangalore
Rajesh Menon
Karnataka government
Cricket
T20 World Cup
Shahid Veer Narayan Singh International Stadium

More Telugu News