ఇజ్రాయెల్‌ దాడుల్లో పీఐజే కమాండర్‌ అబూ హమ్జా హతం

  • బీరుట్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు
  • బీరుట్ శివార్లలోని హారెట్ హ్రీక్ ప్రాంతాన్ని అటాక్ చేసిన ఇజ్రాయెల్
  • పీఐజే ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా హతం

పశ్చిమాసియాలో యుద్ధం ప్రతి నిమిషం మలుపులు తిరుగుతోంది. ఇరాన్ అగ్రనేత ఖమేనీ మృతికి ప్రతీకారంగా హిజ్బుల్లా, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ (పీఐజే) గ్రూపులు ఇజ్రాయెల్‌పై దాడులు ముమ్మరం చేయడంతో, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) లెబనాన్ రాజధాని బీరుట్‌ను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతున్నాయి. ఈ తెల్లవారుజామున బీరుట్ శివార్లలోని 'హారెట్ హ్రీక్' ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇద్దరు కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు.


పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ (పీఐజే) సంస్థకు చెందిన లెబనాన్ విభాగం కమాండర్ అబూ హమ్జా రామిని మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం అధికారికంగా ప్రకటించింది. గత కొన్నేళ్లుగా ఇజ్రాయెల్ పౌరులపై, సైన్యంపై జరిగిన వందలాది దాడులకు ఇతనే సూత్రధారి అని ఐడీఎఫ్ పేర్కొంది. బీరుట్‌లోని హిజ్బుల్లా ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా జరిగిన మరో దాడిలో ఆ సంస్థ ఇంటెలిజెన్స్ చీఫ్ హుస్సేన్ మాక్లెడ్ కూడా హతమయ్యాడు.


హిజ్బుల్లా అనుబంధ వార్తా సంస్థ 'అల్-మనార్' టీవీ కార్యాలయంపై కూడా ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసింది. దాడికి కొన్ని నిమిషాల ముందే ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేయడంతో భారీ ప్రాణనష్టం తప్పినప్పటికీ, భవనం పూర్తిగా ధ్వంసమైంది. లెబనాన్ నుంచి తమ దేశంపైకి వస్తున్న డ్రోన్లు, రాకెట్లకు ప్రతీకారంగానే ఈ దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.



More Telugu News