దుబాయ్‌లో చిక్కుకున్న 149 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చిన‌ ఎయిరిండియా

  • ఇవాళ‌ ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన AI916D ప్రత్యేక విమానం 
  • ప్రభుత్వం, డీజీసీఏ సహకారంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఎయిర్ ఇండియా వెల్ల‌డి
  • అనుమతులు లభిస్తే మరిన్ని విమానాలు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటన
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దుబాయ్‌లో చిక్కుకుపోయిన 149 మంది భారతీయులను ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా నడిపిన AI916D విమానం మంగళవారం ఉదయం 10:58 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. VT-EDC రిజిస్ట్రేషన్ గల ఈ విమానంలో మొత్తం 149 మంది ప్రయాణికులు ఉన్నారు.

ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రయాణికులను స్వదేశానికి తీసుకురావడం కోసం ఒక భారతీయ విమానయాన సంస్థ నడిపిన తొలి విమానం ఇదే కావడం గమనార్హం. "దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికులను స్వదేశానికి స్వాగతిస్తున్నాం" అని ఎయిర్ ఇండియా పేర్కొంది.

ఇదే ఆపరేషన్‌లో భాగంగా, అంతకుముందు మరో ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. AI918D అనే ఈ విమానంలో దుబాయ్‌లో చిక్కుకుపోయిన ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 143 మంది కాక్‌పిట్, క్యాబిన్ సిబ్బందిని సురక్షితంగా ఢిల్లీకి తరలించారు. వారంతా సురక్షితంగా తిరిగి రావడంతో వారి కుటుంబ సభ్యులు, సంస్థ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.

ఈ ప్రత్యేక విమానాలను నడపడం కోసం తమ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్, ఇతర సహాయక బృందాలు రాత్రింబవళ్లు పనిచేశాయని ఎయిర్ ఇండియా వెల్లడించింది. అసాధారణ పరిస్థితుల్లోనూ ఈ తరలింపు ప్రక్రియను విజయవంతం చేసేందుకు అన్ని సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకున్నట్లు వివరించింది.

ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి పూర్తి సహకారం అందించిన భారత ప్రభుత్వం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), దుబాయ్‌లోని స్థానిక అధికారులకు ఎయిర్ ఇండియా కృతజ్ఞతలు తెలియజేసింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసింది. తాము అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, దుబాయ్ విమానాశ్రయ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. అవసరమైన అనుమతులు లభించిన వెంటనే మరిన్ని విమానాలను నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది.


More Telugu News