Pranay Prakash: ఏపీ లిక్కర్ కేసు... నేపాల్ సరిహద్దుల్లో ప్రణయ్ ప్రకాశ్ అరెస్ట్

Pranay Prakash Arrested in AP Liquor Scam at Nepal Border
  • స్కామ్‌లో ఏ-52గా ఉన్న ప్రణయ్ ప్రకాశ్
  • నేపాల్ సరిహద్దుల్లోని సోనౌలీ చెక్‌పోస్ట్ వద్ద అరెస్ట్
  • విజయవాడకు తరలిస్తున్న సిట్ అధికారులు

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్ జరిగింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారుల్లో ఒకరిగా భావిస్తున్న కట్టా ప్రణయ్ ప్రకాశ్‌ను నేపాల్ సరిహద్దుల్లోని సోనౌలీ చెక్‌పోస్ట్ వద్ద సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ స్కామ్‌లో ప్రణయ్ ప్రకాశ్ ఏ-52 నిందితుడిగా ఉన్నారు. లుక్ అవుట్ నోటీసులు జారీ కావడంతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న అతడిని పక్కా సమాచారంతో పట్టుకున్న పోలీసులు, స్థానిక మహారాజ్ గంజ్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తరలిస్తున్నారు.


కట్టా ప్రణయ్ ప్రకాశ్ అరెస్టుతో ఈ కుంభకోణంలోని మనీ లాండరింగ్ కోణంపై మరిన్ని ఆధారాలు లభించే అవకాశం కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును భద్రపరచడం, రవాణా చేయడంలో ప్రణయ్ కీలక పాత్ర పోషించినట్లు సిట్ ఇప్పటికే గుర్తించింది. ప్రణయ్ అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 17కు చేరింది.


 ఇటీవలే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి (A2), ముప్పిడి అవినాశ్ రెడ్డి (A7) వంటి కీలక వ్యక్తులను ఇటీవల సిట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితుడు ప్రణయ్‌ను విజయవాడకు తీసుకువచ్చిన తర్వాత కస్టడీలోకి తీసుకుని విచారిస్తే, ఈ స్కామ్ వెనుక ఉన్న మరికొందరు పెద్దల పేర్లు, విదేశాలకు తరలిన నిధుల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Pranay Prakash
AP Liquor Scam
Andhra Pradesh
Liquor Case
SIT Investigation
Nepal Border
Money Laundering
Vasudeva Reddy
Muppidi Avinash Reddy

More Telugu News