బీఆర్ నాయుడు.. నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు: భూమన
- బీఆర్ నాయుడు మహిళా వ్యసనపరుడన్న భూమన
- వీడియోలు బయటపడ్డాయని వెల్లడి
- బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్
టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ బీఆర్ నాయుడు లక్ష్యంగా మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శల దాడిని ఉద్ధృతం చేశారు. తిరుపతిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "బీఆర్ నాయుడు... నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు, నిన్ను కనీసం మనిషిలా కూడా చూడను" అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓ దశలో "పోరంబోకు" అనే పదం కూడా ఉపయోగించారు.
ఈ సందర్భంగా బీఆర్ నాయుడు ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు చెబుతున్న కొన్ని వీడియోలు, ఫొటోలను భూమన మీడియా ముందు ప్రదర్శించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
తమపై వస్తున్న ఆరోపణలను బీఆర్ నాయుడు 'డీప్ ఫేక్' అని కొట్టిపారేయడాన్ని భూమన తీవ్రంగా తప్పుబట్టారు. అవి డీప్ ఫేక్ వీడియోలు కావని, తాము అన్ని కోణాల్లో నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతే ఈ విషయాన్ని బయటపెడుతున్నామని స్పష్టం చేశారు. 2019లోనే సదరు మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసిందని... బీఆర్ నాయుడు మహిళా వ్యసనపరుడని ఆ లేఖలో పేర్కొన్నదని భూమన తెలిపారు. అప్పట్లో ఆ లేఖ చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకుంటే నమ్మానని, కానీ ఇప్పుడు వీడియోలు ప్రత్యక్షం కావడంతో అసలు రంగు బయటపడిందని ఆరోపించారు.
పవిత్రమైన టీటీడీ ఛైర్మన్ పదవిలో కొనసాగే అర్హత ఆయనకు లేదని, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ రాజీనామా చేయకుంటే భవిష్యత్తులో మరిన్ని వాస్తవాలను ఆధారాలతో సహా బయటపెడతామని భూమన హెచ్చరించారు.