సంజూ విరోచిత ఇన్నింగ్స్‌.. కోహ్లీ రికార్డు బ్రేక్‌.. మోహన్ లాల్ ప్ర‌శంస‌లు

  • ఒంటిచేత్తో భారత్‌ను గెలిపించిన సంజూ శాంసన్
  • 97 పరుగులతో అజేయంగా నిలిచి జ‌ట్టుకు సెమీస్ బెర్తును ఖాయం చేసిన వైనం
  • ఛేజింగ్‌లో కోహ్లీ రికార్డును బద్దలుకొట్టిన శాంసన్
  • ఇది ఒక మాస్టర్‌ఫుల్ ఇన్నింగ్స్ అంటూ మోహన్ లాల్ కితాబు
టీ20 ప్రపంచకప్‌లో సంజూ శాంసన్ అసాధారణ పోరాటంతో అదరగొట్టాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మొదటి బంతి నుంచి చివరి వరకు క్రీజులో ఉండి, 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. తన వీరోచిత ఇన్నింగ్స్‌తో టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించి సెమీఫైనల్ బెర్తును ఖాయం చేశాడు.

పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శాంసన్, ఆరంభం నుంచే బాధ్యతాయుతమైన ఆటతీరు కనబరిచాడు. లక్ష్య ఛేదనలో ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం ఒత్తిడికి లోనుకాలేదు. నిలకడగా ఆడుతూనే, అవసరమైనప్పుడు అద్భుతమైన షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివరి వరకు క్రీజులో పాతుకుపోయి విజయ లాంఛనాన్ని పూర్తి చేయడం ద్వారా తన క్లాస్‌ను, తెగువను ప్రదర్శించాడు. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

రికార్డుల మోత మోగించిన శాంసన్.. కోహ్లీ రికార్డు బ్రేక్!
ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో సంజూ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లలో ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ (82 నాటౌట్‌) పేరిట ఉన్న రికార్డును శాంసన్ (97 నాటౌట్) బద్దలు కొట్టాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్ధశతకాలు (6) సాధించిన భారత వికెట్ కీపర్‌గానూ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో ఇషాన్ కిషన్ (5) రెండో స్థానంలో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో సురేశ్‌ రైనా (101) తర్వాత అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రెండో భారత ఆటగాడిగానూ సంజూ నిలిచాడు.

కష్ట సమయంలో జట్టును సంజూ ఆదుకున్న తీరు అద్భుతం: మోహన్ లాల్
శాంసన్ అద్భుతమైన ఆటతీరుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సంజూను ప్రత్యేకంగా అభినందించారు. "సంజూ అద్భుత ఫామ్‌లో ఉండటం చూడటానికి సంతోషంగా ఉంది. ఇది ఒక మాస్టర్‌ఫుల్ ఇన్నింగ్స్. ఇది అతని ప్రతిభతో పాటు వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. కష్ట సమయంలో జట్టును ఆదుకున్న తీరు అద్భుతం" అని ఆయన కొనియాడారు. ఇక ఈ విజయంతో సెమీస్‌కు చేరిన భారత్, గురువారం జరిగే రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.


More Telugu News