Ali Khamenei: ఖమేనీ హత్య... హైదరాబాదులో నల్ల దుస్తులు ధరించి రోడ్డెక్కిన షియా ముస్లింలు

Ali Khamenei death Shia Muslims protest in Hyderabad
  • ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యపై హైదరాబాద్‌లో నిరసనలు
  • అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ భారీ ర్యాలీ
  • ఖమేనీ మృతికి సంతాపంగా ఇరాన్ కాన్సులేట్ వద్ద జెండా అవనతం
  • ముందస్తు జాగ్రత్తగా పాతబస్తీలో పోలీసుల భారీ బందోబస్తు
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంపై హైదరాబాద్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆదివారం పాతబస్తీలోని షియా ముస్లింలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఖమేనీ మరణవార్త ధృవీకరణ కావడంతో పాతబస్తీలోని షియా ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పురానీ హవేలీ, నూర్ ఖాన్ బజార్, దారుల్ఫా తదితర ప్రాంతాల్లో నల్ల దుస్తులు ధరించి, చేతిలో ఖమేనీ ఫొటోలు పట్టుకుని ర్యాలీలు నిర్వహించారు.

తంజీమ్-ఎ-జాఫరీ సంస్థ పిలుపు మేరకు పురానీ హవేలీలోని మజార్-ఎ-ఇబ్నే-ఖతూన్ నుంచి భారీ ర్యాలీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న పలువురు కంటతడి పెడుతూ నినాదాలు చేశారు. అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినందుకే ఖమేనీని పొట్టనబెట్టుకున్నారని, అగ్రరాజ్యాలకు తలొగ్గని నేతగా ఆయన నిలిచారని షియా మత పెద్దలు కొనియాడారు. ముస్లింల మధ్య ఐక్యత లేకపోవడమే ఈ విషాదానికి దారితీసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు ఖమేనీ మృతికి సంతాప సూచకంగా హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం వద్ద ఆ దేశ జాతీయ జెండాను అవనతం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పాతబస్తీలో ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, శనివారం ఉదయం టెహ్రాన్‌లో తన నివాసంలోని కార్యాలయంలో ఉండగా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మృతి చెందారని ఇరాన్ మీడియా వెల్లడించింది.
Ali Khamenei
Khamenei death
Hyderabad protests
Shia Muslims
Iran supreme leader
Old City Hyderabad
Iran consulate
US Israel attacks
Shia protest

More Telugu News