Donald Trump: ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్ కుట్ర.. అమెరికా సంచలన ఆరోపణ

Mike Waltz accuses Iran of Trump assassination plot
  • ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో తీవ్ర ఉద్రిక్తతలు
  • ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్ కుట్ర పన్నిందన్న అమెరికా
  • ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రభుత్వ హెచ్చరిక
  • ఇజ్రాయెల్‌తో కలిసి ఆపరేషన్ నిర్వహించామన్న యూఎస్
  • శాంతిని కాపాడాలని ఐక్యరాజ్యసమితి పిలుపు
ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ పరిణామంపై అమెరికా, ఇరాన్ పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. తమ నాయకుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ శపథం చేయగా, ఇరాన్ దుశ్చర్యల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అమెరికా వాదిస్తోంది.

శనివారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ ఇరాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్ గతంలోనే కుట్ర చేసిందని సంచలన ఆరోపణ చేశారు. "గత 47 ఏళ్లుగా ఇరాన్ ప్రపంచవ్యాప్తంగా రక్తపాతానికి కారణమవుతోంది. తన అనుచర వర్గాల ద్వారా మా స్థావరాలపై దాడులు చేస్తోంది. అందుకే అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఇజ్రాయెల్‌తో కలిసి ఈ సైనిక చర్య చేపట్టాం" అని ఆయన స్పష్టం చేశారు. ఖమేనీ మరణంతో ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

మరోవైపు, తమ సుప్రీం లీడర్ మరణాన్ని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. ఇది అమెరికా చేసిన 'పెద్ద నేరం' అని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఖమేనీ మృతికి సంతాప సూచికగా దేశవ్యాప్తంగా 40 రోజుల సంతాప దినాలు ప్రకటించింది.

ఇరాన్‌తో శాంతి చర్చలకు చేసిన ప్రయత్నాలు విఫలమవడం వల్లే ఈ సైనిక చర్య అనివార్యమైందని మైక్ వాల్ట్జ్ సమర్థించుకున్నారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ స్పందిస్తూ ఇరు దేశాలు సంయమనం పాటించాలని, శాంతిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
Donald Trump
Iran
Mike Waltz
Ayatollah Ali Khamenei
US Iran tensions
United Nations
Iran assassination plot
Middle East conflict
Israel military action
António Guterres

More Telugu News