Israel: ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. మార్గమధ్యంలోనే వెనుదిరిగిన ఎయిరిండియా విమానం

Israel Attacks Iran Air India Flight Returns Mid Air
  • ఇరాన్‌పై ఇజ్రాయెల్ మెరుపు దాడులతో ఉద్రిక్తత
  • ఢిల్లీ నుంచి టెల్ అవీవ్ బయల్దేరి ఎయిర్ ఇండియా విమానం వెనక్కి మళ్లింపు
  • టెహ్రాన్‌లో పలుచోట్ల భారీ పేలుళ్లు.. దట్టమైన పొగలు
  • మధ్యప్రాచ్యంలో గగనతలం మూసివేత.. దారి మళ్లిన విమానాలు
  • ఇజ్రాయెల్‌లో స్కూళ్లు బంద్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
ఇరాన్‌పై ఇజ్రాయెల్ 'ప్రివెంటివ్' దాడులు (ముందస్తు దాడులు) చేయడంతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. దీంతో శనివారం ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్ నగరమైన టెల్ అవీవ్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం మార్గం మధ్యంలోనే వెనక్కి తిరిగి వచ్చేసింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాన్ని తిరిగి ఢిల్లీకే రప్పించినట్లు అధికారులు తెలిపారు.

ఇరాన్‌పై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అధికారికంగా ధృవీకరించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని యూనివర్సిటీ స్ట్రీట్, జోమ్హౌరీ జిల్లాల్లో క్షిపణి దాడులు జరిగినట్లు, అక్కడ భారీ పేలుళ్లు వినిపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కీలక ప్రభుత్వ భవనాలు ఉన్న పాశ్చర్ స్ట్రీట్ సమీపంలో దట్టమైన పొగలు అలుముకున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఆస్తి, ప్రాణనష్టం వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. మరోవైపు, తాము పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.

యుద్ధ వాతావరణం కారణంగా ఆ ప్రాంతంలో గగనతలాన్ని పాక్షికంగా మూసివేయడంతో పలు అంతర్జాతీయ విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. కజకిస్థాన్ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన విమానాన్ని బాకుకు మళ్లించగా, షార్జా-మాస్కో విమానాన్ని పాకిస్థాన్ గగనతలం మీదుగా దారి మళ్లించారు. చికాగో నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం సిరియా మీదుగా ప్రయాణించింది.

దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్లు మోగించారు. ముందు జాగ్రత్త చర్యగా దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేశారు. ప్రజలను ఇళ్ల నుంచే పని చేయాలని (Work from home), బహిరంగ ప్రదేశాల్లో గుమికూడవద్దని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదేశించింది. జెనీవాలో అమెరికా, ఇరాన్ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్న కీలక సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం. 
Israel
Iran Israel conflict
Israel attacks Iran
Air India
Tel Aviv
Middle East tension
Flight Diversion
Tehran
Air raid sirens
Work from home

More Telugu News