అగ్నివీర్లు, ఆర్మీ రిటైర్డ్ సిబ్బందికి కేంద్రం గుడ్ న్యూస్

  • అగ్నివీర్లు, మాజీ సైనికుల కోసం రైల్వే, ఆర్మీ మధ్య ఒప్పందం
  • రిటైర్డ్ అగ్నివీర్లకు రైల్వే ఉద్యోగాల్లో 10% వరకు రిజర్వేషన్లు
  • మాజీ సైనికులకు లెవెల్-1 పోస్టుల్లో 20 శాతం కోటా కేటాయింపు
  • కాంట్రాక్టు పద్ధతిలో 5,000 మంది పాయింట్స్‌మెన్ల నియామకానికి చర్యలు
సైన్యంలో పని చేసిన సిబ్బందికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.  సైన్యం నుంచి రిటైరయ్యే అగ్నివీర్లు, ఇతర సిబ్బందికి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. భారత సైన్యం, రైల్వే శాఖ సంయుక్తంగా "ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ కోఆపరేషన్"ను ప్రారంభించాయి. సైనిక సిబ్బంది పదవీ విరమణ తర్వాత రైల్వేలో సులభంగా ఉద్యోగాలు పొందేందుకు ఈ ఒప్పందం మార్గం సుగమం చేస్తుంది. 

ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, మాజీ సైనికులు, అగ్నివీర్లకు రైల్వే ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించనున్నారు. మాజీ సైనికులకు లెవెల్-1 పోస్టుల్లో 20 శాతం, లెవెల్-2 ఆ పైస్థాయి పోస్టుల్లో 10 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. అదేవిధంగా, రిటైర్డ్ అగ్నివీర్లకు లెవెల్-1 పోస్టుల్లో 10 శాతం, లెవెల్-2 ఆ పైస్థాయి పోస్టుల్లో 5 శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. 

ఈ ఒప్పందంలో భాగంగా, తక్షణమే 5 వేల మందికి పైగా మాజీ సైనికులను కాంట్రాక్టు ప్రాతిపదికన 'పాయింట్స్‌ మెన్‌'గా నియమించుకోనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. రెగ్యులర్ నియామకాలు పూర్తయ్యే వరకు ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఇప్పటికే 9 రైల్వే డివిజన్లు, ఆర్మీ సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి.


More Telugu News