సునీల్ నాయక్ అరెస్ట్ ఎపిసోడ్.. బీఎన్ఎస్ఎస్-218ని ప్రయోగించిన బీహార్

  • ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌కు అండగా నిలిచిన బీహార్ ప్రభుత్వం
  • తమ పోలీసులపై చర్యలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వులు
  • భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 218 కింద చట్టపరమైన రక్షణ
  • ఏపీ పోలీసులు నాయక్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఈ నిర్ణయం
బీహార్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో తమ రాష్ట్ర పోలీసు సిబ్బందికి చట్టపరమైన రక్షణ కల్పిస్తూ బీహార్ ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ఇతర రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలంటే తమ ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది.

బీహార్ హోం శాఖ గురువారం జారీచేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 218 కింద రాష్ట్ర పోలీసులకు ఈ రక్షణ కల్పించారు. దీనివల్ల విధి నిర్వహణకు సంబంధించి ఏ పోలీసు అధికారిపైన అయినా కేసు నమోదు చేయాలన్నా, కోర్టు విచారణ చేపట్టాలన్నా ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అవుతుంది. కేంద్ర బలగాలకు ఉన్నటువంటి రక్షణనే రాష్ట్ర పోలీసులకు వర్తింపజేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

2021లో ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో హింసించారన్న ఆరోపణలపై ఐజీ సునీల్ నాయక్‌పై కేసు నమోదైంది. అప్పట్లో నాయక్ ఏపీ సీఐడీలో డీఐజీగా డిప్యూటేషన్‌పై ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 23న ఏపీ పోలీసులు పాట్నాలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు.

అయితే, ఏపీ పోలీసుల అరెస్ట్ ప్రక్రియలో లోపాలున్నాయని పేర్కొంటూ పాట్నా సివిల్ కోర్టు ట్రాన్సిట్ రిమాండ్‌ను తిరస్కరించింది. నాయక్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించడంతో పాటు, 30 రోజుల పాటు ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని సూచించింది. ఈ క్రమంలోనే సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.


More Telugu News