బెంగళూరు బస్సులో యువ జంటకు కండక్టర్ నుంచి వేధింపులు.. మూడు బెర్తులు బుక్ చేసినా వేర్వేరుగా కూర్చోవాలట!

  • పోలీసులకు, తల్లిదండ్రులకు ఫోన్ చేస్తానని బెదిరించిన కండక్టర్
  • 'నైతిక దాడి' అంటూ రెడిట్‌లో పోస్ట్ చేసిన బాధితుడు
  • కండక్టర్ తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్ల తీవ్ర ఆగ్రహం
బెంగళూరు నుంచి ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సులో యువ జంటకు వేధింపులు ఎదురయ్యాయి. 22 ఏళ్ల యువకుడు, అతని స్నేహితురాలు కలిసి సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు మూడు లోయర్ బెర్తులను బుక్ చేసుకున్నారు. అయినప్పటికీ వారు డబుల్ బెర్త్‌లో కలిసి కూర్చోవడంపై బస్సు కండక్టర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. విడివిడిగా కూర్చోవాలని హుకుం జారీ చేయడమే కాకుండా మాట వినకపోతే పోలీసులకు, వారి తల్లిదండ్రులకు ఫోన్ చేస్తానని బెదిరించాడు. ఈ 'నైతిక దాడి'పై ఆ యువకుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో తన అనుభవాన్ని పంచుకోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

"బెంగళూరు నుంచి ప్రైవేట్ స్లీపర్ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు మాకు ఒక వింత అనుభవం ఎదురైంది. మేమిద్దరం (ఇద్దరం మేజర్లం) 2x1 ఏసీ స్లీపర్‌లో మూడు లోయర్ బెర్తులను బుక్ చేసుకున్నాం. అదనపు స్థలంతో ఒకరు సౌకర్యంగా నిద్రపోవచ్చని అలా చేశాం. ఇది గమనించిన కండక్టర్, మొదట మమ్మల్ని విడివిడిగా కూర్చోవాలని సూచించాడు. మేము స్పందించకపోవడంతో 'మీ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తా', 'పోలీసు స్టేషన్‌కు వెళ్దాం' అంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. ఇది మమ్మల్ని చాలా భయపెట్టింది" అని ఆ యువకుడు రెడిట్‌లో రాసుకొచ్చాడు.

"గొడవ అనవసరం అని భావించి, చివరికి అతను చెప్పినట్లే విడిగా కూర్చున్నాం. కానీ, ఈ సంఘటన మాకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. మా వద్ద సరైన టికెట్లు ఉన్నాయి. మేమెలాంటి ఇబ్బంది కలిగించలేదు. ఇది నిబంధనల అమలు కంటే నైతిక దాడిలా అనిపించింది" అని అతను తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్న‌మైన‌ స్పందన వస్తోంది. ఖాళీగా ఉన్న బెర్త్‌ను వేరేవారికి అమ్ముకుని డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతోనే కండక్టర్ ఇలా ప్రవర్తించి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు పెళ్లికాని జంటలు బస్సుల్లో ప్రయాణించే విషయంలో స్పష్టమైన నిబంధనలు లేకపోవడాన్ని విమర్శించారు. 

ఒక యూజర్ స్పందిస్తూ, "మీరు టికెట్లు కొన్నప్పుడు, కండక్టర్‌కు అభ్యంతరం చెప్పే హక్కు లేదు. భయపడకుండా ధైర్యంగా నిలబడాల్సింది. ఇలాంటి వారిని వదిలేస్తే మరింత రెచ్చిపోతారు" అని వ్యాఖ్యానించారు. మరో యూజర్, "ఇలాంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అప్పుడే వారికి బుద్ధి వస్తుంది" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


More Telugu News