సుప్రీంకోర్టులో మల్లారెడ్డికి దక్కని ఊరట

  • మాజీ మంత్రి మల్లారెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
  • హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ  
  • సర్వే ప్రక్రియ పూర్తయినందున జోక్యానికి నిరాకరణ
సుప్రీంకోర్టులో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిలకు చుక్కెదురైంది. జీడిమెట్ల భూ సర్వేకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. 

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని జీడిమెట్ల సర్వే నం. 82/1/ఈఈలో గల 0.33 గుంటల భూమికి హద్దులు నిర్ణయించాలని కోరుతూ శేరి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తొలుత హైకోర్టును ఆశ్రయించారు. తన భూమికి వెళ్లే దారిని మూసివేశారని, ఈ విషయంలో తహసీల్దార్ జారీ చేసిన లేఖను కూడా ఆయన తన పిటిషన్‌లో సవాల్ చేశారు. 

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి, 45 రోజుల్లోగా సర్వే పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ తీర్పును మల్లారెడ్డి తదితరులు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయగా, సింగిల్ జడ్జి ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం సమర్థించింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

ఈ పిటిషన్‌పై నిన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్‌.వి. అంజరియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. సర్వే ప్రక్రియ ఇప్పటికే పూర్తయినందున, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
 

Malla Reddy
Telangana
Supreme Court
High Court
Land Dispute
Survey
Kuthbullapur
జీడిమెట్ల
BRS Leader
Real Estate

More Telugu News