Akshat Pratap Singh: ‘నీట్’ సెగ: తండ్రిని కాల్చి చంపి.. ముక్కలు చేసి డ్రమ్ములో కుక్కిన కొడుకు!

Akshat Pratap Singh Kills Father Over NEET Pressure in Lucknow
  • ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం
  • నీట్ పరీక్ష కోసం ఒత్తిడి చేస్తున్నాడని తండ్రిని చంపిన కొడుకు
  • మృతదేహాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో దాచిన వైనం
  • చెల్లెలి ముందే తండ్రిని చంపి, బయటపెడితే చంపేస్తానని బెదిరింపు
  • విచారణలో నేరాన్ని అంగీకరించిన నిందితుడు
లక్నోలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నీట్ పరీక్షకు సిద్ధం కావాలని తండ్రి పదేపదే ఒత్తిడి చేయడంతో ఆగ్రహానికి గురైన ఓ కొడుకు.. అతడిని కాల్చి చంపాడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఇంట్లోని డ్రమ్ములో దాచిపెట్టాడు. చెల్లి కళ్లెదుటే ఈ ఘోరానికి పాల్పడి, విషయం బయటపెడితే చంపేస్తానని ఆమెను బెదిరించడం గమనార్హం.

లక్నోలోని ఆశియానా ప్రాంతానికి చెందిన వర్ధమాన్ పాథాలజీ యజమాని మాన్వేంద్ర ప్రతాప్ సింగ్ (49), ఫిబ్రవరి 20 నుంచి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు మాన్వేంద్ర కుమారుడు అక్షత్ ప్రతాప్ సింగ్ (19) ప్రవర్తనపై అనుమానం వచ్చింది. విచారణలో అతను పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు.

డీసీపీ విక్రాంత్ వీర్ కథనం ప్రకారం నీట్ పరీక్ష ప్రిపరేషన్ విషయంలో తండ్రీకొడుకుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఫిబ్రవరి 20న ఇదే విషయమై వాగ్వాదం జరగడంతో ఆవేశంలో అక్షత్ తన తండ్రి లైసెన్స్‌డ్ రైఫిల్‌తో కాల్చి చంపాడు. అనంతరం మృతదేహాన్ని మూడో అంతస్తు నుంచి కిందికి తెచ్చి, ఆధారాలను నాశనం చేసేందుకు ముక్కలుగా నరికాడు. కొన్ని శరీర భాగాలను సదరోనా గ్రామం సమీపంలో పడేసి, మిగిలిన భాగాలను ఇంట్లోని ఓ డ్రమ్ములో దాచిపెట్టాడు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రమ్ములో ఉన్న మృతదేహం భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించింది. నిందితుడు అక్షత్‌ను అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Akshat Pratap Singh
NEET exam
Manvendra Pratap Singh
Lucknow crime
murder case
crime news
father son conflict
forensic investigation
Uttar Pradesh police

More Telugu News