నేను పరారీలో లేను.. నా భార్యను అన్యాయంగా కేసులో ఇరికించారు: ఎమ్మెల్సీ అనంతబాబు
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు
- తాను వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉన్నానన్న అనంతబాబు
- ఇప్పటి వరకు పోలీసుల నోటీసులు అందలేదని వెల్లడి
- కావాలనే తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని మండిపాటు
- వైసీపీలో చురుగ్గా ఉన్నవారిని వేధిస్తున్నారని వ్యాఖ్య
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి గళమెత్తారు. తన భార్య లక్ష్మీదుర్గను ఈ కేసులోకి అన్యాయంగా లాగారని, ఆమెను నిందితురాలిగా (ఏ2) చేర్చడం రాజకీయ కక్షసాధింపేనని ఆయన మండిపడ్డారు. తాను పరారీలో లేనని, కేవలం వ్యక్తిగత పనులతో బిజీగా ఉన్నానని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసుల నుంచి తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు అందలేదని, ఒకవేళ నోటీసులు ఇస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టు తన డిఫాల్ట్ బెయిల్‌ను శాశ్వతం చేసిందని గుర్తు చేస్తూ... ప్రస్తుత కూటమి ప్రభుత్వం తనను, తన కుటుంబాన్ని కావాలనే లక్ష్యంగా చేసుకుందని అనంతబాబు ఆరోపించారు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశం వంటి కీలక విషయాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే తన కేసును మళ్లీ హైలైట్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. వైసీపీలో చురుగ్గా ఉన్నవారిని వేధించడమే ధ్యేయంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, హైకోర్టులో తాను సవాలు చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, గతంలో పోలీసులు తనకు సహకరించారన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆయన అన్నారు. పోలీసుల సహకారం ఉంటే ఏడు నెలల పాటు జైలులో ఉండాల్సిన అవసరం వచ్చేది కాదని, చట్టం తన పని తాను చేసుకుపోయిందని వెల్లడించారు. ఈ కేసును కులం లేదా రాజకీయ పార్టీతో ముడిపెట్టవద్దని, దీన్ని పూర్తిగా తన వ్యక్తిగత అంశంగా మాత్రమే చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.