Nara Lokesh: శ్రీవారి లడ్డూ కల్తీపై పూర్తి వివరాలను రేపు అసెంబ్లీలో వెల్లడిస్తాం: నారా లోకేశ్
- శ్రీవారి లడ్డూ కల్తీకి సంబంధించిన వాస్తవాలను అసెంబ్లీ వేదికగా బయటపెడతామన్న నారా లోకేశ్
- ఆధారాలు సహా అన్నీ బయటపెడతామని వెల్లడి
- రాజకీయలబ్ధి కోసం దేవుడిని రోడ్డు మీదకు తీసుకువస్తున్నారని మండిపాటు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన అపచారానికి సంబంధించి కీలక వాస్తవాలను అసెంబ్లీ వేదికగా బహిర్గతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. సోమవారం ప్రారంభమైన ఎనిమిదవ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కలియుగ దైవానికి జరిగిన మహాపచారంపై పూర్తి వివరాలను రేపు సభ ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో దోషులెవరో, కల్తీ నెయ్యి వినియోగం వెనుక ఉన్న వాస్తవాలేమిటో ఆధారాలతో బయటపెడతామని ఆయన పేర్కొన్నారు.
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా తప్పించుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చట్టసభకు రావడం, ప్రజా సమస్యలపై చర్చించడం శాసనసభ్యులుగా వారి ప్రాథమిక బాధ్యత అని గుర్తు చేశారు. "అసెంబ్లీకి రమ్మని ఎవరూ బొట్టుపెట్టి పిలవరు" అంటూ వైసీపీ నేతలకు చురకలంటించిన ఆయన... సభను బహిష్కరించడం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం దేవుడిని సైతం రోడ్డు మీదకు తీసుకురావడం బాధాకరమని, దేవుడి ఫొటోలతో చట్టసభల ప్రాంగణంలో ర్యాలీలు చేయడం అత్యంత అభ్యంతరకరమని ఆయన వ్యాఖ్యానించారు.
గత జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) ఇప్పటికే తన విచారణను పూర్తి చేసి నివేదికను అందజేసింది. అయితే తమ తప్పేమీ లేదని, ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలు వాదిస్తున్న తరుణంలో... ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టబోయే నివేదికపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.