ట్రంప్ రిసార్ట్ లో తుపాకీతో ఆగంతుకుడి కలకలం... కాల్చివేసిన భద్రతా సిబ్బంది

  • ట్రంప్ ఫ్లోరిడా రిసార్ట్ లోకి చొరబడిన ఆగంతకుడు
  • షాట్‌గన్‌తో దాడికి యత్నించిన వైనం
  • సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల కాల్పుల్లో వ్యక్తి మృతి
  • ఘటన సమయంలో వైట్‌హౌస్‌లో ఉన్న ట్రంప్ 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాజమాన్యంలోని ఫ్లోరిడా రిసార్ట్ లో తీవ్ర కలకలం రేగింది. పామ్ బీచ్‌లోని ప్రఖ్యాత మార్-ఎ-లాగో ఎస్టేట్‌లోకి షాట్‌గన్, ఇంధనం క్యాన్‌తో చొరబడేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు. ఈ ఘటన గత అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 గంటల సమయంలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం, మార్-ఎ-లాగో రిసార్ట్ ఉత్తర గేటు నుంచి ఒక వాహనం బయటకు వస్తుండగా, అదే అదనుగా మరో వాహనంలో వచ్చిన ఆగంతకుడు లోపలికి ప్రవేశించాడు. అతని వద్ద షాట్‌గన్, ఇంధనంతో కూడిన క్యాన్ ఉండటాన్ని గమనించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, పామ్ బీచ్ కౌంటీ షెరిఫ్ డిప్యూటీలు అతన్ని అడ్డుకున్నారు. ఆయుధాలు కింద పెట్టాలని ఆదేశించారు.

అయితే, ఆ వ్యక్తి ఇంధనం క్యాన్‌ను కింద పెట్టి, తన వద్ద ఉన్న షాట్‌గన్‌ను ఏజెంట్ల వైపు గురిపెట్టాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతను అక్కడికక్కడే మరణించినట్లు పామ్ బీచ్ కౌంటీ షెరిఫ్ రిక్ బ్రాడ్‌షా ధృవీకరించారు. ఈ ఘటనలో సిబ్బంది ఎవరికీ గాయాలు కాలేదు.

మృతుడిని నార్త్ కరోలినాకు చెందిన 20 ఏళ్ల యువకుడిగా అనుమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అతను కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఘటన జరిగిన సమయంలో ట్రంప్, ఆయన భార్య మెలానియా వైట్‌హౌస్‌లో ఉన్నారు. నిందితుడి ఉద్దేశం ఏమిటి, అతని మానసిక పరిస్థితిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది. గతంలో 2024లో ట్రంప్‌పై రెండుసార్లు హత్యాయత్నాలు జరిగిన నేపథ్యంలో ఈ తాజా ఘటన భద్రతా వర్గాలను మరోసారి అప్రమత్తం చేసింది.


More Telugu News