టెక్నాలజీ పెరిగినా మీ 'హ్యూమన్ టచ్'కు సాటిలేదు: గ్రామీణ డాక్ సేవక్‌లపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

  • గ్రామీణ డాక్ సేవకుల సేవలు అమూల్యం అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
  • కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని సమర్థతపై ప్రశంసలు
  • ఏపీలోని 17,000 మంది డాక్ సేవకులకు ఎలక్ట్రిక్ సైకిళ్లు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి
  • రాష్ట్ర ప్రభుత్వ సేవలను కూడా డాక్ సేవకుల ద్వారా అందిస్తామని హామీ
  • వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో పోస్టల్ ఉద్యోగులదే కీలక పాత్ర అని వెల్లడి
టెక్నాలజీ ఎంత అభివృద్ధి సాధించినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి అందుబాటులోకి వచ్చినా, గ్రామీణ ప్రాంతాల్లో మానవతా స్పర్శతో సేవలు అందించే గ్రామీణ డాక్ సేవకులకు ప్రత్యామ్నాయం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో వారి పాత్ర అత్యంత కీలకమని, వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఆదివారం నాడు గుంటూరులో గ్రామీణ డాక్ సేవక్‌లతో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసానిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పాత రోజులను గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు ఉత్తరాలు, మనీ ఆర్డర్లు, ఇతర సమాచారం కోసం ప్రతి ఒక్కరూ పోస్ట్‌మ్యాన్‌పైనే ఆధారపడేవారని, బ్యాంకులు లేని రోజుల్లో ఆర్థిక లావాదేవీలకు కూడా ఇండియా పోస్టే కీలక మాధ్యమంగా ఉండేదని తెలిపారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో కూడా సమరయోధుల మధ్య సమాచారాన్ని చేరవేసి పరోక్షంగా కీలక పాత్ర పోషించిన వారి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

కేంద్ర మంత్రులపై ప్రశంసల వర్షం

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించిన ఉన్నత విద్యావంతుడని, రాజవంశంలో పుట్టినా అత్యంత పట్టుదలతో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని కొనియాడారు. సింధియా నాయనమ్మ, గ్వాలియర్ రాజమాత విజయరాజే సింధియాతో తనకు మంచి అనుబంధం ఉందని, ఆమె ఎన్టీ రామారావుగారికి అత్యంత సన్నిహితురాలని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా, సింధియా తండ్రి మాధవరావు సింధియాతో కూడా కలిసి పనిచేశానని, ఆయన నిరాడంబరత, నిజాయతీ గొప్పవని అన్నారు. 

సింధియా పూర్వీకుల గ్రామమైన 'సింధియా' విశాఖపట్నం గాజువాక సమీపంలో ఉండటం ఆనందంగా ఉందని, వారి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్‌తో ఉన్న ఈ అనుబంధం గొప్పదని పేర్కొన్నారు. మరో కేంద్ర మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసానిని ప్రశంసిస్తూ, ఒక వైద్యుడిగా, ఐటీ నిపుణుడిగా అమెరికాలో అపారమైన సంపద సృష్టించి, ఇప్పుడు పార్లమెంటులో అత్యంత సంపన్న ఎంపీగా ప్రజాసేవకు ముందుకు రావడం స్ఫూర్తిదాయకమన్నారు. వీరిద్దరి వంటి సమర్థవంతమైన నాయకులు కేంద్రంలో ఉండటం దేశానికి గర్వకారణమని చంద్రబాబు అభివర్ణించారు.

డాక్ సేవకులకు ఎలక్ట్రిక్ సైకిళ్లు.. ఏపీని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టండి

భవిష్యత్తులో గ్రామీణ డాక్ సేవకుల సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నొక్కిచెప్పారు. వారి పనిభారాన్ని తగ్గించి, ఉత్పాదకతను పెంచేందుకు వీలుగా రాష్ట్రంలోని 17,000 మంది గ్రామీణ డాక్ సేవకులకు ఎలక్ట్రిక్ సైకిళ్లను అందించాలని కేంద్ర మంత్రి సింధియాను కోరారు. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఒక 'ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్'గా పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల కాలుష్యరహిత ప్రయాణంతో పాటు, శ్రమ తగ్గి గ్రామీణ ప్రాంతాల్లో మరింత వేగంగా సేవలు అందించగలరని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సేవలను కూడా గ్రామీణ డాక్ సేవకుల ద్వారా ప్రజలకు చేరవేస్తామని, ఇందుకు అవసరమైన సమన్వయం చేసుకుంటామని హామీ ఇచ్చారు.

డబుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధి పరుగులు

రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటంతో అభివృద్ధి సూపర్ స్పీడ్‌తో ముందుకు సాగుతోందని చంద్రబాబు తెలిపారు. 20 నెలల సుపరిపాలనలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికామని అన్నారు. ఒకప్పుడు స్మశానం, ఎడారి అన్న అమరావతిని దేవతల రాజధానిగా, ప్రపంచం మెచ్చే ప్రజా రాజధానిగా తీర్చిదిద్దుతామని పునరుద్ఘాటించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడి, లాభాల బాట పట్టించామని, ఈ నెలలోనే రూ.54 కోట్ల లాభం వచ్చిందని వెల్లడించారు. 

2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని, ఈ 'వికసిత్ భారత్' లక్ష్య సాధనలో గ్రామీణ డాక్ సేవకులే వెన్నెముకగా నిలుస్తారని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వారిపై ఉందని సూచించారు.




More Telugu News