కాంగ్రెస్ నిరసనలపై జగన్ ట్వీట్... "అమోఘం" అంటూ నారా లోకేశ్ కౌంటర్

  • యూత్ కాంగ్రెస్ తీరు సిగ్గుచేటంటూ జగన్ విమర్శ
  • జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మంత్రి లోకేశ్
  • గతంలో పెట్టుబడులను దెబ్బతీశారంటూ జగన్‌పై ఆరోపణలు
  • జగన్ నకిలీ సానుభూతి ప్రదర్శిస్తున్నారని లోకేశ్ ఎద్దేవా
ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసన తెలిపిన వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేయడం తెలిసిందే. "ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు. మన రాజకీయాలు ఎటు వెళ్తున్నాయి? రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా, ప్రపంచం ముందు దేశం పరువు తీయకూడదు" అని జగన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దేశం విషయంలో అందరం ఐక్యంగా నిలబడాలని హితవు పలికారు. జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. అసలు దేశ ప్రతిష్ఠ గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదంటూ విరుచుకుపడ్డారు.

జగన్ హిపోక్రసీ (కపటత్వం) అమోఘమని లోకేశ్ ఎద్దేవా చేశారు. "భారతదేశ పెట్టుబడుల వాతావరణాన్ని అందరికంటే ఎక్కువగా దెబ్బతీసిన వ్యక్తి, ఇప్పుడు నకిలీ సానుభూతి ప్రదర్శిస్తున్నారు" అని విమర్శించారు. ఈ సందర్భంగా జగన్ గతంలో తీసుకున్న పలు నిర్ణయాలను లోకేశ్ ప్రస్తావించారు. 2017లో ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకునేందుకు ఎయిర్‌పోర్టులో ధర్నా చేయడం, 2019లో విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడం, 2020లో అమరావతిలో సింగపూర్ ప్రభుత్వ పెట్టుబడులను వెనక్కి పంపడం, 2025లో ప్రభుత్వ నిధుల సమీకరణను అడ్డుకోవాలని ఆర్‌బీఐకి లేఖ రాయడం వంటి చర్యలను గుర్తుచేశారు. ఇప్పుడు ఏఐ సమ్మిట్ గురించి ఆందోళన చెందుతున్నట్లు నటించడం విడ్డూరంగా ఉందని లోకేశ్ వ్యాఖ్యానించారు.


More Telugu News