పవన్ కల్యాణ్ చొరవతో కొణిదెల గ్రామానికి మహర్దశ

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో నంద్యాల జిల్లా, నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామ రూపురేఖలు మారుతున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గ్రామాభివృద్ధికి నడుం బిగించిన పవన్, తన వ్యక్తిగత విరాళంతో పాటు ప్రభుత్వ పథకాల ద్వారా కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయించారు. ఆయన అందించిన రూ. 50 లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకు ద్వారా గ్రామస్థుల దశాబ్దాల తాగునీటి కష్టాలు తీరనున్నాయి.

2019 ఎన్నికల ప్రచార సమయంలో తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం, గత ఏడాది నియోజకవర్గ పర్యటనలో రూ. 50 లక్షల విరాళం అందజేశారు. గ్రామస్థుల ప్రధాన సమస్య అయిన తాగునీటి ఎద్దడిని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా, ఆ నిధులతో 90,000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకు నిర్మించాలని సూచించారు. 

ఈ ట్యాంకు ద్వారా గ్రామంలోని సుమారు 2,000 మందికి రక్షిత తాగునీరు అందనుంది. వేసవికి ముందే నిర్మాణం పూర్తి కావడం పట్ల పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ, అధికారులను అభినందించినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

ఈ ట్యాంకుతో పాటు ప్రభుత్వ పథకాల ద్వారా సుమారు రూ. 6 కోట్లకు పైగా నిధులను గ్రామానికి మళ్లించారు. 'పల్లెపండగ 1.0' కింద రూ. 20 లక్షలతో మూడు అంతర్గత రహదారులు పూర్తి కాగా, 'పల్లెపండగ 2.0'లో రూ. 45 లక్షలతో ఏడు సీసీ రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. గ్రామీణ రహదారి అభివృద్ధి సబ్ ప్లాన్ కింద కొణిదెల జిల్లా పరిషత్ స్కూల్ నుంచి లక్ష్మాపురం వరకు 5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 4 కోట్లు, ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి గ్రామానికి రహదారి పునరుద్ధరణకు రూ. 45 లక్షలు మంజూరు చేయించారు.

వీటితో పాటు గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు 4 గోకులాలు, గృహ నిర్మాణ శాఖ ద్వారా 19 ఇళ్లు, నీటితొట్టెలు నిర్మించారు. ఉపాధి హామీ పథకం కింద రైతుల కోసం 49 ఫీడర్ ఛానల్స్‌ను అభివృద్ధి చేయడంతో పాటు, రెండు మైనర్ కాలువల పునరుద్ధరణ, మూడు కమ్యూనిటీ చెక్ డ్యామ్‌ల మరమ్మతులు కూడా పూర్తి చేశారు. ఇచ్చిన హామీ మేరకు గ్రామస్థులు కోరిన ప్రతి పనిని చేపడుతూ, కొణిదెల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది.

Pawan Kalyan
Konidela Village
Nandyala District
drinking water
village development
Andhra Pradesh
Palle Pandaga
rural development
water tank
government schemes

More Telugu News