JC Prabhakar Reddy: నా కుమారుడి వ్యాఖ్యలను వక్రీకరించారు: జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy Slams Media for Distorting Sons Comments
  • ఏపీ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని అస్మిత్ రెడ్డి అన్నారన్న జేసీ
  • ఈ వ్యాఖ్యలను కొందరు జర్నలిస్టులు వక్రీకరించారని మండిపాటు
  • చంద్రబాబు నేర్పించిన విజన్ తో తాము బతుకుతున్నామని వ్యాఖ్య

తన కుమారుడు అస్మిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కొంతమంది జర్నలిస్టులు వక్రీకరిస్తున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని అస్మిత్ రెడ్డి అన్న మాటలను కొందరు జర్నలిస్టులు వక్రీకరించారని మండిపడ్డారు. జగన్ హయాంలో తెచ్చిన అప్పులకు తమ ప్రభుత్వం వడ్డీ కడుతోందని చెప్పారు. తాడిపత్రిలో జరుగుతున్న అభివృద్ధి గురించి జగన్‌కు తెలియదని... ఆయనకు చెప్పాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


చంద్రబాబు నేర్పించిన విజన్‌తో తాము బతుకుతున్నామని... ఆయన రాత్రి పగలు లేకుండా రాష్ట్ర అభివృద్ధికి శ్రమిస్తున్నారని కితాబునిచ్చారు. మంత్రి నారా లోకేశ్ సహా కూటమి నేతలు అహర్నిశలు కష్టపడుతున్నారని తెలిపారు. వైసీపీ హయాంలో పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులను నిర్లక్ష్యంగా వదిలేశారని విమర్శించారు.

ఏప్రిల్ నాటికి తాడిపత్రికి సోలార్ విద్యుత్ వస్తుందని చెప్పారు. కడప, కర్నూల్‌లో లేని విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తాడిపత్రిలో ఉందని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లే తాము తాడిపత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 
JC Prabhakar Reddy
Asmith Reddy
Tadipatri
Andhra Pradesh Government
Nara Lokesh
Chandrababu Naidu
Polavaram Project
Anantapur
AP Debt
Solar Power

More Telugu News