ట్రంప్ 'టారిఫ్' ట్విస్ట్: భారత్‌పై పన్ను 18 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు.. తాత్కాలికమేనన్న వైట్ హౌస్!
- అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో తగ్గిన భారం
- తాత్కాలికంగా 10 శాతం పన్ను విధింపు
- కొత్త చట్టాల వేటలో ట్రంప్ సర్కారు
- భారత్‌తో వాణిజ్యంపై పట్టుదల
అసలు విషయం ఏమిటంటే, గతంలో భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పన్నును 25 నుంచి 18 శాతానికి తగ్గించారు. కానీ, ఆ పన్ను విధింపుకు వాడిన చట్టం (IEEPA) చెల్లదని కోర్టు తీర్పునివ్వడంతో, ట్రంప్ సర్కారు ఇప్పుడు సెక్షన్ 122 కింద కొత్తగా 10 శాతం పన్నును అమలు చేస్తోంది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. "భారత్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో ఎలాంటి మార్పు లేదు. వారు పన్నులు చెల్లించాల్సిందే, మేము మాత్రం చెల్లించం. ఇది ఇప్పుడు న్యాయమైన ఒప్పందంగా మారింది" అని వ్యాఖ్యానించారు.
అయితే, ఈ 10 శాతం పన్ను కేవలం ఒక ఆరంభం మాత్రమేనని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. భవిష్యత్తులో సెక్షన్ 232 లేదా 301 వంటి మరింత శక్తిమంతమైన చట్టాలను ఉపయోగించి, ఈ పన్నులను భారీగా పెంచే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. "మేము అనుకుంటే పన్నులు ఇంకా పెరగవచ్చు. మా వద్ద పాత చట్టాల కంటే శక్తిమంతమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి" అని ట్రంప్ విలేకరులతో అన్నారు. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులకు ప్రస్తుతానికి పన్ను భారం తగ్గినా, రాబోయే రోజుల్లో అనిశ్చితి కొనసాగే అవకాశం ఉంది.